అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీతో పెళ్లైన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆమె పవర్ఫుల్ పాత్రతో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వనుంది. ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో అనుష్క లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతే కాదు ఈ సినిమా కోసం అనుష్క గట్టిగానే ప్రాక్టిస్ చేస్తోంది. క్రికెట్‌లో శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక ‘చక్ధా ఎక్స్ ప్రెస్’ సినిమాను ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా కర్నేష్ శర్మ నిర్మిస్తోన్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న.. ఈ సినిమా కోసం భారీగానే ప్లాన్ చేశారు మేకర్స్. అంతేకాదు సినిమా షూటింగ్‌ను వేగ వంతం చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని నాలుగు అగ్ర స్టేడియంలను షూటింగ్ చేయడానికి సెలక్ట్ చేశారట చిత్ర బృందం.
ఇందులో భాగంగానే యూకేలోని లార్డ్స్ స్టేడియం, ఉత్తర ఇంగ్లాండ్‌లోని హెడింగ్లీ స్టేడియంలో షూటింగ్ చేయనున్నారు. అలాగే, ఇండియాలోని ఓ ప్రధాన స్టేడియంలో కూడా షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు చక్దా ఎక్స్ ప్రెస్ టీం. తాజా సమాచారం ప్రకారం.. యార్క్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో నిర్మాత కర్నేష్ శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్ కొత్త స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ప్రకటించింది. కావున 2022 సీజన్‌కు హెడ్డింగ్లీ స్టేడియంలో ప్రిన్సిపల్ స్పాన్సర్‌గా బాధ్యతలు స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో చక్ధా ఎక్స్ ప్రెస్ షూటింగ్ ఈ స్టేడియంలో చేయనున్నట్లు ఖాయంగా తెలుస్తోంది.
అనుష్క శర్మ ఎప్పుడు కూడా మంచి కథలనే ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలోనే జులన్ గోస్వామి బయోపిక్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో స్టార్ క్రికెటర్‌గా ఎదగడానికి ఓ మహిళ ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొందని చూపించనున్నారు మేకర్స్. ఇక, క్రికెట్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో విరుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంతేకాదు, మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్న ఈ సినిమాపై ఆమె అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన జీరో సినిమాలో 3 సంవత్సరాల క్రితం చివరిగా నటించింది అనుష్క శర్మ.