స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల ఓట్లకు కూడా ప్రాధాన్యత ఉంటది. వారి ఓట్లతో కూడా అధికారం చేపట్టే పదవులు ఉన్నాయి. అయితే.. తమ ఓట్లను ఉపయోగించుకుంటారు కానీ.. వారి అవసరాలను తీర్చడానికి మాత్రం పెద్దలకు తీరిక ఉండదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యుల తీరుపై సొంత పార్టీ నేతలతో సహా పలువురు ఎంపీటీసీలు ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎంపీపీ ఇద్రీస్ ఆధ్వర్యంలో జరిగిన ఏ ఒక్క సమావేశానికి కూడా ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కాని వైనంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సభకు హాజరుకాని అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయో.. అదే విధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలపై కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని సభలో సొంతపార్టీ సభ్యులే ప్రస్తావించడం గమనార్హం. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో విధిగా హాజరు కావలసిన బాధ్యత సంబంధిత ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఉంటుందని.. కానీ దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గర్జించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి ఏనాడు మండల సర్వసభ్య సమావేశాలకు హజరుకాలేదని మండిపడ్డారు. తమకు ఓట్లు వేసి ఎన్నకున్న ప్రజాప్రతినిథులకు తమ ముఖం ఇంతవరకు చూపించలేదని మండిపడ్డారు.
శిలాఫలకాలపై పేరు లేకపోతే ప్రోటోకాల్ గుర్తుకొస్తుంది.. తప్పా ప్రజాప్రతినిధులు, ప్రజల ప్రయోజనాలు మాత్రం పట్టవని అర్సుకున్నారు. ఫరూక్ నగర్ టీఆర్ఎస్ జెడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు భీశ్వ రామకృష్ణ, మధురాపురం స్వతంత్ర ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, మొగిలిగిద్ద కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీశైలం తదితరులు ఎమ్మెల్సీ, ఎంపీల తీరుపై గళమెత్తారు.
తమ హక్కులను, నిధులను, విధులను ఎవరిని అడిగాలో తెలియక ఇప్పటికే ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారని పేర్కొన్నారు. కనీసం గెలిచాక ఒక్కసారైనా సభా మర్యాద కోసమైనా హాజరు కాలేదని వారు దుమ్మెత్తిపోశారు. పదవులు వచ్చాక స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు సమావేశాలకు హాజరు కాకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు.. మరి వీరిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదని జెడ్పీటీసీ వెంకట్రాం రెడ్డి వాపోయారు. సభలో లేవనెత్తిన ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.