రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోళన వాతావరణం నెలకొంది. టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఎన్ఎస్యూఐ అధ్వర్యంలో మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఎలా రాస్తారో చెప్పాలని మంత్రిని నిలదీశారు జగ్గారెడ్డి.
ఇదే సమస్య గురించే చర్చించేందుకు అపాయింట్ మెంట్ అడిగితే.. ఇటు మంత్రి సబిత ఇవ్వరు.. అటు సీఎం కేసీఆర్ పర్మీషన్ ఇవ్వకుండా రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. సబితాఇద్రారెడ్డి కాంగ్రెస్ పాలనలో బాధ్యతాయుతంగా పనిచేశారని.. కేసీఆర్ టీంలో చేరి ఆమె కూడా కేసీఆర్ దారిలోనే నడుస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రం పరిధిలో ఉన్న పరీక్ష వాయిదా వేయడానికి కుదరదు.. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆర్ఆర్బీ పరీక్షను వాయిదా వేయమని కోరండి అని మంత్రి అనడం అవివేకమని మండిపడ్డారు. అవగాహనలేని మంత్రి సబిత అని విమర్శించారు. పోలీసులను ముందు పెట్టి పాలన సాగించాలని చూస్తే.. ప్రజలే బుద్ధి చెప్తారని మండిపడ్డారు.
అనంతరం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఏడాది క్రితం వస్తే.. టేట్ నోటిఫికేషన్ నెల రోజుల క్రితం వచ్చిందన్నారు. దేశం మొత్తం రాసే ఆర్ఆర్బీ పరీక్ష ఎలా వాయిదా వేస్తారని నిలదీశారు వెంకట్. రెండు రోజుల్లో టెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన రాకపోతే.. రాష్ట్రంలో మరోపోరుకు సిద్ధం అవుతామని హెచ్చరించారు వెంకట్.