విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పంతుల్లే బద్మాష్ పనులు చేస్తే ఎరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి.ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నా.. గుణగణాల్లో మాత్రం కీచకుడిని మించిపోయాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. పాఠశాలలో చేయకూడని పనులు చేస్తూ నీచానికి దిగజారాడు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ సేపూరి నరసింహ.. గత కొద్ది కాలంగా విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం, వారితో బయట నుంచి సిగరెట్లు, మద్యం తెప్పించుకోవడం లాంటివి చేస్తున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో విద్యార్థులంతా మాకు ఈ హెడ్ మాస్టర్ వద్దంటూ పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేపడుతున్న సమయంలో పాఠశాలలో హెడ్ మాస్టర్ అక్కడ లేకపోవడంతో ఎమ్ఈవో ఆదేశాలతో.. గుండ్రంపల్లి ప్రధానోపాధ్యాయుడు వచ్చి తల్లిదండ్రులకు సర్ధిచెప్పారు.
విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే అతన్ని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.