కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానితో భేటీ అవుతారు. ఒకే.. ఏపీ సీఎం జగన్ కూడా డిల్లీ వెళ్తున్నారు. అది కూడా ఓకే. కానీ ఇద్దరు సీఎంలు ఒకేసారి ఢిల్లీ వెళ్లటం, వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రధానితో భేటీ అవుతుండటం వెనుక రీజనేంటి? ఇది యాధృచ్ఛికం అని కొట్టి పారేసే మేటర్ కాదు, ఇందులో ఏదో మర్మం దాగి ఉందని అంటున్నాయి రాజకీయవర్గాలు
రాజకీయాల్లో కొన్ని మాటలు, మీటింగ్‌లు అలా జరిగిపోతాయి. పైకి కామనే కదా అనిపించినా, వాటిలోనే అనేక అంతరార్థాలు దాగి ఉంటాయి. ఇప్పుడు జగన్, కేసీఆర్ వరుసగా మోడీ దగ్గరకు పరుగెత్తటం కూడా అందులో భాగమేనన్న వాదనలు జోరందుకున్నాయి. కొంతకాలంగా కేసీఆర్ మోడీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. ఫస్ట్ టర్మ్‌లో ఉన్నంత దోస్తీ రెండోసారి అధికారంలోకి వచ్చాక లేదు. ఇక జగన్ కూడా అంతే. ఎన్నికల ముందు వరకు బీజేపీ-వైసీపీ ఒక అవగాహనతో ముందుకెళ్లాయన్న వార్తలొచ్చాయి. నేతల మాటలు కూడా అందుకు బలం చేకూర్చాయి. కానీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ-వైసీపీ మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్లు కనపడుతోంది.
ఇక ఈ మద్య జగన్-కేసీఆర్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పేరుకు గోదావరి నీళ్ల తరలింపు అంశం అని పైకి చెప్పినా ఏకాంతంగా ఇరువురు సీఎంలు తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ దూకుడు అంశాన్ని చర్చించుకున్నట్లు బయటకు పొక్కింది. అందుకే ఎక్కువ డ్యామేజీ జరగకముందే అబ్బే, అలాంటిది ఏమీ లేదు… మేం కేవలం గోదావరి సహా అంతరాష్ట్ర విషయాలే మాట్లాడుకున్నాం అని సీఎంవోలు నోట్ రిలీజ్ చేశాయి. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది పరిస్థితి అని ఆనాడే రాజకీయ విశ్లేషకులు వాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఇద్దరు సీఎంలు ప్రధానితో భేటీ అవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కచ్చితంగా ఇది మాములు భేటీ కాదని, మేమూ మీతోనే ఉన్నాం, ఉంటున్నాం… అంటూ బీజేపి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే భేటీయేనని అంటున్నారు విశ్లేషకులు. సమావేశాలు జరిగాక కానీ దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.