– ఓవైపు రైతుల పాదయాత్ర
– ఇంకోవైపు జేఏసీ విశాఖ గర్జన
– మూడు రాజధానులపై ముదురుతున్న వివాదం
– వైసీపీపై పవన్ సీరియస్
– అదే స్థాయిలో మంత్రి కౌంటర్
వైసీపీది మూడు రాజధానుల నినాదం.. మిగిలిన పార్టీలది అమరావతి మంత్రం.. ఎవరి గోల వారిదే. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తాత్కాలిక భవనాలన్నా నిర్మాణం జరిగాయి.. జగన్ పాలనలో వికేంద్రీకరణ పేరుతో కాలయాపన తప్ప ఒక ఇటుక వేయలేదనేది టీడీపీ వాదన. కోర్టు మొట్టికాయల తర్వాత అన్నా జగన్ మారతారని అనుకుంటే.. మూడు రాజధానుల విషయంలో మంకు పట్టు పట్టారని విమర్శిస్తోంది. అటు అమరావతి రైతులు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతా టీడీపీ చేయిస్తోందని తిట్టిపోస్తున్నారు.
ఇంకోవైపు మూడు రాజధానుల కోసం ఐక్యకార్యాచరణ కమిటీ సైతం ఏర్పాటైంది. ఈ రాజకీయేతర జేఏసీలో విద్యా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. కానీ, దీన్ని వెనకుండి నడిపిస్తోంది వైసీపీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ లజపతి రాయ్ దీనికి కన్వీనర్ గా వ్యవహరిస్తోన్నారు. అయితే, విశాఖపట్నాన్ని వెంటనే కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించలనే డిమాండ్ తో ఈ నెల 15న విశాఖ గర్జన ఆందోళనను చేపట్టనుంది జేఏసీ. అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, దీనికి మద్దతుగా ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో పలువురు నేతలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నుంచి దేనికీ గర్జనలు అనే పేరుతో వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘‘మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?విశాఖలో రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?.. దేనికీ గర్జనలు’’ అని ప్రశ్నించారు.
వరుస ట్వీట్లు చేసిన పవన్.. జగన్ సర్కార్ కు ఇంకొన్ని ప్రశ్నలు వేశారు. ‘‘రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డీఏలు ఇవ్వనందుకా? అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా? గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా? విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేసినందుకా? ప్రజలు కోరిన మీదటే ఛార్జీలు పెంచామని చెప్పుకొన్నందుకా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతటితో ఆగలేదు.. ‘‘ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నందుకా? విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లతో మరుగు దొడ్ల ఫోటోలు తీయిస్తున్నందుకా? మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసినందుకా? విదేశీ విద్యా స్కీమ్ కి పేరు మార్చి నిధులు ఇవ్వనందుకా? శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేసి అక్రమ రవాణా చేస్తున్నందుకా? మడ అడవులు ధ్వంసం చేసేస్తున్నందుకా? అని నిలదీశారు.
‘‘కాలుష్యకారక పరిశ్రమలు బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ముద్దులుపెట్టి… ఇప్పుడు ఆ పరిశ్రమలకు రిబ్బన్లు కట్ చేస్తున్నందుకా? గ్రామ పంచాయతీల నిధులు మళ్లించేసినందుకా? మా పంచాయతీ నిధులు మాకు ఇవ్వండి అని అడిగిన సర్పంచులను అరెస్టులు చేస్తున్నందుకా? భర్తీ చేస్తామన్న 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకా? పోలీసు రిక్రూట్మెంట్ చేయనందుకా? డిఎస్సీ ఊసు వదిలేసినందుకా? వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నందుకా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకా? ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేసినందుకా? పాలన వైఫల్యాలు దాచుకొనేందుకు కులాల మధ్య చిచ్చు రేపినందుకా? స్కూల్స్, ప్రభుత్వ భవనాల నుంచి ఆలయ విద్యుత్ అలంకరణ వరకూ పార్టీ రంగులు వేసుకొంటున్నందుకా? హైకోర్టుతో చీవాట్లు తిన్నందుకా? కౌలు రైతులకు మొండి చేయి చూపించినందుకా? వ్యవసాయ రంగాన్ని వదిలేసి, సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నందుకా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోయినందుకా? నిర్వాసితులను గాలికొదిలేసినందుకా?కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులుపెట్టిస్తున్నందుకా? పోలీసు వ్యవస్థ చేతులు కట్టేసినందుకా?ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా? సంపూర్ణ మద్య నిషేధం అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? మద్య నిషేధం ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? మద్య నిషేధ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా? 151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?’’ దేనికీ గర్జనలు అంటూ వైసీపీ సర్కార్ ను కడిగిపారేశారు పవన్.
పవన్ ట్వీట్లకు వైసీపీ నేతలు బాగా హర్టయ్యారు. వరుసబెట్టి కౌంటర్ ట్వీట్లు ఇస్తున్నారు. దీనిపై మంత్రి అమర్ నాథ్ స్పందిస్తూ.. ‘‘దత్త తండ్రి చంద్రబాబు తరఫున దత్త పుత్రుడు పవన్ మియావ్ మియావ్. ఆయన త్రీ క్యాపిటల్స్..
1. అంతర్జాతీయ రాజధాని మాస్కో
2. జాతీయ రాజధాని ముంబై
3. పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. అంటూ చురకలంటించారు అమర్ నాథ్.