ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్ లైన్ ను క్రాస్ చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ పదే పదే హెచ్చరించినా పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ పోడియం చుట్టుముట్టారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.
అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జీవో నెంబర్-1ని రద్దు చేయాలని పట్టుబట్టారు. ఈ విషయమై అసెంబ్లీ వెల్ లో కి వెళ్లి టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. అసెంబ్లీ వెల్ లోని రెడ్ లైన్ దాటడంతో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
స్పీకర్ రూలింగ్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో రెడ్ లైన్ దాటిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఆటోమెటిక్ గా సస్పెన్షన్ వర్తించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. శుక్రవారం వెలగపూడి రామకృష్ణ, బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి, ఏలూరి సాంబశివరావు, చినరాజప్ప, డోల స్వామి, మంతెన రామరాజులను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.
కాగా ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ లో టీడీపీ సభ్యులు ప్రతి రోజూ సస్పెన్షన్ అవుతున్నారు. సమావేశాల ప్రారంభం రోజున, గురువారం మినహాయించి ప్రతీ రోజూ సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురవుతూనే ఉన్నారు. అసెంబ్లీలో ఏదో ఒక అంశంపై టీడీపీ సభ్యులు నిరసనలకు దిగుతున్నారు. ఈ విషయమై సభలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో స్పీకర్.. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు. టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను ఈ అసెంబ్లీ సెషన్ పూర్తయ్యేంత వరకూ స్పీకర్ సస్పెండ్ చేశారు.