ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 14 వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు.
అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది క్లారిటీ రాలేదు. ఈ నెల 14 నుంచి 24 వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
తొలి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్ర నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. రెండవ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చిస్తారు. ఇక శాసనమండలి సభ్యులు చల్లా భగీరథరెడ్డి,బచ్చుల అర్జునుడు మృతిపై సభలో సంతాప తీర్మానం అనంతరం సమావేశం వాయిదా పడనుంది.
ఇక మూడవ రోజు నుంచి యధావిధిగా సభ జరుగనుంది. అయితే బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని బీఏసీ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.