వారు వీరయ్యారు. వీరు వారయ్యారు. పరకాయ ప్రవేశం చేసినట్లు చంద్రబాబు, జగన్ పాత్రలు మార్చుకున్నారు. ఏపీ అసెంబ్లీకే బీపీ తెప్పించారు. అంటించాల్సిన చురక అంటిస్తూనే.. అనాల్సిన మాటలు నవ్వూతూ అనేసి.. ఏమిటయ్యా చంద్రబాబు ఎందుకంత కోపం అంటూ జగన్ చాలా కన్నింగ్ గా వ్యవహరించారు. ’’పై కంపార్ట్ మెంట్ లో ఖాళీ పెట్టుకుంటే ఎలాగా‘‘ అంటూ ఇన్ డైరెక్టుగా బ్రెయిన్ లో ఏమీ లేదన్నట్లుగా కామెంట్ చేశారు. అలా కించపర్చడంతో చంద్రబాబు చాలా సీరియస్ గా రియాక్టయ్యారు. తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా.. ఇలా కించపర్చేలా మాట్లాడటాన్ని చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే ఆవేశంగా దూసుకురావడమే కాక.. పోడియం దగ్గర బైఠాయించారు. ఎప్పుడూ ఎమ్మెల్యేలు వెళ్లి బైఠాయించేవారు, చంద్రబాబు మాత్రం తన స్థానంలోనే ఉండేవారు. కాని ఈసారి సీన్ రివర్స్ అయింది. అసలు ఎమ్మెల్యేలకన్నా ముందే చంద్రబాబు వెళ్లి ఆవేశంగా భైఠాయించారు.
ఇన్ పుట్ సబ్సిడీ. ఇది రైతులకు పంట నష్టానికి ఇచ్చేది. దీనిపైనే గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడటమే కాక.. ఇలాగే వాగ్యుద్ధాలు జరిగి.. చివరకు వాకౌట్ చేశారు. అదే సబ్జెక్ట్ పై ఈసారి చంద్రబాబు నిలదీస్తే.. జగన్ కించపర్చారు. తెలుగుదేశం వాదన ఏంటంటే.. రైతులకు భారీ నష్టం జరిగింది, వెంటనే ఆదుకోవాలి.. పైగా అలర్ట్ చేయడంలోనూ ప్రభుత్వం ఫెయిలైందని ఆరోపించారు. జగన్ మాత్రం.. తాము ఇన్ పుట్ సబ్సిడీ డిసెంబర్ నెలాఖరులోపు ఇచ్చేస్తామని ప్రకటించారు. అంత త్వరగా ఇస్తుంటే.. గొడవెందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని.. పై కంపార్ట్ మెంటు ఖాళీగా పెట్టుకోకూడదని కామెంట్ చేశారు.
అసలు విషయం ఏంటంటే.. గతంలో ఏ తుఫాను వచ్చినా..ఆర్టీజీఎస్ ద్వారా చంద్రబాబు ఫుల్లు మానిటరింగ్ చేసేవారు. ప్రతి అధికారిని ఇన్ వాల్వ్ చేసేవాళ్లు. దాంతో తక్కువ నష్టంతో బయటపడేవాళ్లు. పైగా నష్టం జరిగాక.. దానిని అంచనా వేయడం.. ఆ సాయం అందించడం అంతా రోజుల్లో జరిగిపోయేది. అయితే గతంలో చంద్రబాబు సైతం ఈ విషయంలో లేటు చేసేవాళ్లు. కాని ఈసారి టర్మ్ లో మాత్రం రెండు తుఫాన్ల సందర్భంగాను జాగ్రత్తలు తీసుకున్నారు. కాకపోతే దానికి ప్రచారం మాత్రం కాస్త అతిగానే చేసుకునేవారు.
ఇక జగన్ మాత్రం ఈ విషయంలో చాలా పూర్. చంద్రబాబు ఎక్కువ పట్టించుకుంటే.. ఈయన అసలు పట్టించుకోడు. అందుకే ఈసారి నివర్ విషయంలో ఇంత నష్టం జరుగుతుందని కనీసం మీడియాలో కూడా ఎక్కడా రాలేదు. తీరం దాటుతుంది.. దాటింది తప్ప.. తర్వాత రోజుకుగాని పంట నష్టం దారుణంగా జరిగిందన్న సంగతిని గమనించారు. అప్పటి నుంచే హడావుడి మొదలైంది. ఆ అంచనాలు వచ్చిన ఒక రోజు తర్వాత జగన్ ఏరియల్ సర్వే చేశారు.
తెలుగుదేశం ఈ విషయాలను ఎక్స్ పోజ్ చేసింది. రైతులను ముందే అలర్ట్ చేయలేదని.. లేదంటే కోతకు సిద్ధంగా ఉన్న పంటను నీటిపాలు చేసుకునేవాళ్లు కాదని చంద్రబాబు వాదించారు. అందుకే ఇప్పటికైనా సాయం అయినా తొందరగా ఇవ్వమని ఒత్తిడి చేశారు. అందుకు బదులుగా కించపర్చే మాటలు అనిపించుకుని.. చివరకు సభ నుంచి సస్పెండ్ అయ్యారు.