ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత కోసం రూపొందించిన ”దిశ” బిల్లును శాసన సభ ఆమోదించింది. హెం మంత్రి సుచరిత బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై సభలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ బిల్లుకు మద్దతు నిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మాట్లాడుతూ బిల్లును తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి సభలో వివరించారు. మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలంటే కఠిన చట్టాలు అవసరమన్నారు. అనంతరం బిల్లు సభ ఆమోదం పొందినట్టు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. గవర్నర్ ఆమోదం పొందగానే ”దిశ” బిల్లు చట్టంగా మారుతుంది.
మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కేసు నమోదైన 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా బిల్లును రూపొందించారు. లైంగిక నేరాలను విచారించేందుకు బిల్లుతో పాటే ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, చిన్నారులపై దారుణ నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా…సామాజిక మాధ్యమాలు, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించేలా బిల్లులో పొందుపర్చారు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అఘాయిత్యాలకు యత్నించిన వారికి 10 నుంచి 14 ఏళ్ల వరకు శిక్ష పడేలా ”దిశ” చట్టాన్ని రూపొందించారు.