విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చిన బంద్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతోంది. బీజేపీ తప్ప రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. జగన్ ప్రభుత్వం కూడా ఈ బంద్‌కు మద్దతు తెలిపింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు నేడు మూసివేసే ఉండనున్నాయి.
మరోవైపు ఉదయం నుంచే నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ ప్రభావాన్ని బట్టి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బస్సులు నడిచే అవకాశముంది.
రాష్ట్ర బంద్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ వెళ్లనున్నారు. బంద్‌కు సంఘీభావం తెలపనున్నారు. ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే బంద్‌లో పాల్గొంటున్నాయి.