విభజన తర్వాత ఏపీ చిన్న రాష్ట్రం అయిందన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని విమర్శించారు.
ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారని మండిపడ్డారు. రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ ప్రజలు మహా ఉద్యమాన్ని నడుపుతున్నారని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అడ్డుకోవడానికి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక కుట్రలు చేశారని ఆరోపించారు.
దారికి అడ్డంగా ముళ్ల కంచెలు వేసినా.. వాటిని దాటి 800 రోజులుగా అలుపెరగని ఉద్యమాన్ని రైతులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
అమరావతిలో ఏముంది..? శ్మశానం తప్ప అని వైసీపీ నేతలు హేళన చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ శ్మశానాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారా..? అని ప్రశ్నించారు నరేంద్ర.