ఇచట మద్యం ఆదాయం నొక్కేయబడును - ap beverages employee trying to grab government income- Tolivelugu

ఇచట మద్యం ఆదాయం నొక్కేయబడును

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏపీలో మద్యం దుకాణాలు నడుస్తోన్నాయి. ఈ విధానం ఆరంభమైన తొలిరోజే ఎక్సైజ్ అధికారులకు ఓ ఉద్యోగి షాకిచ్చాడు. కలెక్షన్ మొత్తం ఇవ్వకుండా కొంత నొక్కే ప్రయత్నం చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

ap beverages employee trying to grab government income, ఇచట మద్యం ఆదాయం నొక్కేయబడును

గుంటూరు: దశలవారీగా మద్యపానం నిషేధం అమలు చేస్తామని మాటిచ్చిన జగన్ సర్కారు.. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపులను నిర్వహిస్తోంది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో ఈ తరహా నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఒక వ్యక్తికి గరిష్టంగా 3 మద్యం బాటిళ్లనే విక్రయిస్తున్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం దుకాణాల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 3500 సూపర్ వైజర్లు, 8033 మంది సేల్స్‌మెన్‌లను నియమించారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమైన తొలిరోజే ఉద్యోగుల చేతివాటం బయటకొచ్చింది. కృష్ణాజిల్లా పెనమలూరులో చోటు చేసుకున్న ఈ ఆమ్యామ్యా ఎక్సైజ్ అధికారులకు భలే షాకిచ్చింది. పెనమలూరులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణంలో తొలి రోజు రూ.2.03 లక్షల విలువైన మద్యాన్ని విక్రయించారు.
అదే రోజు సాయంత్రం ఎక్సైజ్ అధికారులు డబ్బును తీసుకెళ్లడం కోసం పెనమలూరు వచ్చారు. మద్యం విక్రయించిన శివశంకర్ అనే ఉద్యోగి రూ.2.03 లక్షలకు బదులు రూ.1.61 లక్షలను మాత్రమే ఎక్సైజ్ సిబ్బందికి అప్పగించాడు. మద్యం స్టాక్, ఇచ్చిన నగదును పరిశీలిస్తే ఉద్యోగి చేతివాటం బయటకొచ్చింది. ఇవ్వాల్సిన దాంట్లో రూ.42 వేలు తగ్గిందని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఎక్కడో తేడా కొడుతోందని భావించిన ఆ ఉద్యోగి అక్కడి నుంచి ఉడాయించాడు. అధికారులకు అతను అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వెళ్లి అతడి నుంచి రూ.42 వేలను రాబట్టారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించి మరొకర్ని నియమించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp