టీటీడీ నియామకాలపై బీజేపీ ఆగ్రహం - bjp ap press release about ttd angry on jagan- Tolivelugu

టీటీడీ నియామకాలపై బీజేపీ ఆగ్రహం

రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి!

జగన్ మోహన్ రెడ్డి టీటీడీని ఏం చేయదలచుకున్నారు? ఏం చేయబోతున్నారని ప్రశ్నించిన ఏపీ బీజేపీ

ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే న్యాయపోరాటం చేస్తామని వార్నింగ్

గుంటూరు: టీటీడీ ధర్మకర్తల మండలి నియామకం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో అత్యంత వివాదాస్పదం అవుతోంది. 35 సభ్యుల నియామకంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని రాష్ట్ర బీజేపీ దుయ్యబట్టింది. ఇంతమందితో టీటీడీ పాలక మండలి భారీ కేబినెట్‌ను తలపించేలా ఉందని పేర్కొంది. గతంలో కేవలం ధార్మిక కార్యక్రమాలు, పరిపాలన నిర్వహణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మండలి ఏర్పాటు చేసేవారని, ఇప్పుడు నియామకాల ప్రయోజనాలే వేరని  అన్నారు. తాజాగా ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 35 మందితో అతి పెద్ద జంబో పాలకమండలి ఏర్పాటు చేయడం చూసి భక్తులు విస్తుపోతున్నారని చెప్పారు. 35 మంది సభ్యులకు ప్రోటోకాల్ కింద సేవ చేయాలనుకుంటే టీటీడీ నిధులు పూర్తిగా భక్తులకు కాకుండా పాలకమండలి సభ్యుల సేవకే సరిపోతుందని బీజేపీ ఆరోపించింది. విచక్షణ కోటా కింద 35 మంది సభ్యులకు దర్శనాలు, అకామిడేషన్‌లో ప్రత్యేకమైన కోటా ఇస్తూ పోతే సామాన్యుడు తిరుమల దర్శనం మర్చిపోతారన్నారు.
కేవలం ధార్మిక భావన కలిగిన నిజమైన భక్తులకు మాత్రమే నియామకం జరిగేదని అన్నారు. ఇప్పుడు అసంతృప్తుల కోసం, రాజకీయ విస్తృత ప్రయోజనాల కోసం జగన్ ఈ నియామకాలని వాడుకున్నారని ఆరోపించారు. ఇంతమంది కూర్చొని దేవస్థానాన్ని ఏమి చేస్తారో అని భక్తులు భయపడుతున్నారన్నారు.
బీజేపీ అడిగిన ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలన్నారు. అలానే ఈ నియామకాలను పునఃసమీక్షించుకోవాలని, లేకుంటే న్యాయపోరాటం చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp