సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బీజేపీ సభకు వెళ్తే పెన్షన్లు ఆపుతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. వారికి అసలు బుద్ధి ఉందా..? ఎవరి పింఛన్లు కట్ చేస్తారు..? వైసీపీ… ప్రభుత్వాన్ని నడుపుతోందా..? రౌడీయిజాన్ని నడుపుతోందా..? మాకు కూడా ఫైనాన్స్, జలశక్తి మంత్రులు ఉన్నారు. మీరు రోజూ ఢిల్లీలో ఎవరి దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారో అందరికీ తెలుసు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ నేతలు, అనుచరులు జాగ్రత్తగా ఉండాలి. మీ దురాగతాలు సహించం. బీజేపీ మీ గుండెల్లో నిద్రపోతుంది. మీ అక్రమాలు, ఇసుక దోపిడీని మా కార్యకర్తలు చూస్తూ ఉరుకోరు.
దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. పార్లమెంటులో చట్టం చేశాం. రైతులకు ఏడాదికి రూ.6 వేలు నరేంద్ర మోడీ ఇవ్వడం లేదా..? ప్రతీ గ్రామంలో నరేగా జాబ్ కార్డులతో 100 రోజులు పనిదినాలు కల్పిస్తూ, రూ.20 వేలు ఇవ్వడం లేదా..? విద్యార్థులకు 3 జతల యూనిఫాం, మధ్యాహ్నభోజన పథకం మోడీ ఇస్తున్నవేగా. ప్రజలకు ఇచ్చే బియ్యంలో కేజీకి రూ.33 కేంద్రం ఇస్తున్నవి కావా..? జగన్ ఇచ్చేది నవరత్నాలు అయితే బీజేపీ వంద రత్నాలు ఇస్తోంది. పార్టీలు, వర్గాలు చూడకుండా కోటి ఎల్ఈడీ బల్బులు ఇచ్చింది కేంద్రం.
వైసీపీ గూండాలు దాడిచేస్తే దేశభక్తి గల బీజేపీ కార్యకర్తలు ఛాతీ విరుచుకుని తరిమికొట్టాలి. దమ్ము, ధైర్యం, నీతి, సంకల్పం ఉన్న పార్టీ బీజేపీ. వైసీపీ నాయకులు వ్యాపారాలు చేసుకుంటూ, భూం భూం బీర్లు అమ్ముతున్నారు. అభివృద్ధి బీజేపీదయితే అధికారం, అవినీతి, ఎర్రచందనం వైసీపీది. చంద్రబాబు, జగన్ కలసి చిత్తూరు జిల్లాలో రెండు షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. స్పిన్నింగ్ మిల్లులు అమ్ముతున్నారు. డైరీలు ప్రైవేట్ వారికి అప్పగిస్తున్నారు. విశాఖ జిల్లా తుంపాలలో షుగర్ ఫ్యాక్టరీని తెరిచే దమ్ము జగన్ కు లేదు. వేలకోట్ల నష్టం వస్తున్నా స్టీల్ ప్లాంట్ ను బీజేపీ ఈ నాటికీ కాపాడింది.