భారతీయ జనతా పార్టీపై సీపీఐ చేసిన విమర్శలపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ సీపీఐ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో నానాటికి కనుమరుగవుతున్న పార్టీ సీపీఐ అన్నారు. దేశంలో ఎక్కడా ఒక్క స్థానం లేని పరిస్థితి కి ఎందుకు వచ్చిందని అంతర్మథనం చేసుకోవాలన్నారు. జాతీయ సమావేశాల్లో వారు చర్చించుకోవాలన్నారు. సిద్దాంతపరమైన రాజకీయ పార్టీగా బీజేపీ అభివృద్ధి చెందుతుంది. బీజేపీని దించడమే లక్ష్యం అని చెప్పడం వారికి పక్వం లేని ఆలోచనా విధానం విరుచుకుపడ్డారు సోము వీర్రాజు. పార్టీ మనుగడ కోసమే నేడు విజయవాడ జాతీయ సభలు పెట్టారన్నారు. పేదల పార్టీ అని చెప్పుకునే సీపీఐ నాయకులు బీసీకి ఎందుకు పార్టీ పగ్గాలు అప్పగించ లేదన్నారు.
కోట్లాది మంది పేదల కోసం మోడీ అనేక పధకాలు అమలు చేశారన్నారు. ఒక్క ఏపీలోనే రెండు కోట్ల మందికి ఎల్ఈడీ బల్బులు ఇచ్చారన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేక పోయినా అనేక అంశాలు చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. వాటన్నిటినీ అమలు చేసిన ఏకైక పార్టీ బీజేపీనే అని పేర్కొన్నారు. సీపీఐ నేతలు ఆత్మ పరిశీలన చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వైసీపీ, టీడీపీ తీరుపై మండిపడ్డ సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీని రాజకీయాల కోసం రావణ కాష్టంగా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ, వైసీపీ విధానాల వల్లే ఇప్పుడు ఏపీలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి చేయలేని పార్టీ లు, అవినీతి పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు సోము వీర్రాజు.
ఈ రెండు పార్టీలు విశాఖకు, ఉత్తరాంధ్రకు ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనానికి టీడీపీ, వైసీపీలే కారణమని తీవ్ర స్వరంతో చెప్పారు. ఏపీని అభివృద్ధికి అన్ని విధాలా మోడీ సహకరించారన్నారు. జాతీయ రహదారులు, ఐకాన్ బ్రిడ్జిలు, రైల్వే లైన్లు మేము నిర్మించామన్నారు. విశాఖలో యాభై వేల కోట్ల అభివృద్ధి బీజేపీ చేసిందేనన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి ఆ రెండు పార్టీలే కారణమన్నారు. మీకు చెప్పుకునేందుకు వీలు లేక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని ఆరోపణలు చేశారు. మేము అందరినీ ఏకోన్ముఖులనం చేస్తున్నాం. మీరు మీ స్వలాభం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని దూయబట్టారు సోము వీర్రాజు.
విజయవాడ టీటీడీ కళ్యాణ మండంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ నేత సోము వీర్రాజు. అనంతరం పళ్ళు, ప్రసాదాలు స్వయం గా సోము వీర్రాజు వితరణ చేశారు. సోమువీర్రాజు జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజుతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీ రాం, దాహం ఉమామహేశ్వరరావు, చిరువోలు బుచ్చిరాజు, లక్ష్మీ పతి రాజా, అప్పిరెడ్డి వెంకట్, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు.