ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీ రాజధాని గ్రామాల్లో సోము వీర్రాజు, ఇతర బీజేపీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆస్పత్రి, అమృత్ వీఐటీ, ఎస్‌ఆర్‌ఎమ్, అమృత యూనివర్సిటీ సంస్థలను సోమువీర్రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వెళ్ళే మార్గాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక పోవడం జగన్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆపేసి… ఎడారిగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నారని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేశారు. విశాఖకు జగన్ చేసిందేమీ లేదు… ఉంటే చెప్పాలని నిలదీశారు. మూడేళ్లల్లో ఏపీకి జగన్ ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు సోము వీర్రాజు. అమరావతి రైతులు యాత్ర చేస్తుంటే కుట్ర చేస్తారా అంటూ దూయ బట్టారు. దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ఈ యూనివర్శిటీ లలో అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుతున్నారు. ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాంచాల్సిన బాధ్యత ఎపీ ప్రభుత్వంపై ఉందన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు.
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మన రాష్ట్రం గురించి ఏమనుకుంటారో కూడా ఆలోచన చేయడం లేదని ఆరోపించారు. ఈ తోలు మందం ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోదన్నారు. 11 కిలోమీటర్ల ఉన్న రోడ్ ను డబుల్ లైన్ గా అభివృద్ధి చేయాలన్నారు. యూనివర్శిటీ వాళ్ల పై కూడా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లు నా దృష్టి కి వచ్చిందన్నారు. ఇటువంటి చర్యలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. ఈ యూనివర్శిటీ కి వచ్చే ఒక్క రోడ్ కూడా బాగోలేదన్నారు. అన్నీ తెలిసినా జగన్ మొద్దు నిద్ర పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడే రాజధాని అని అధికారంలోకి వచ్చి మాట తప్పి, మడమతిప్పాడని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ అంటే అసలు జగన్ కి అర్దం తెలుసా? అని ప్రశ్నించారు. విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్లు నిధులు ఇచ్చింది. విజయనగరం నుంచి చత్తీస్‌గఢ్ వరకు నాలుగు రోడ్లు విస్తరిస్తున్నామన్నారు సోము వీర్రాజు.
రైతుల ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వల్లే రైతులు ఇప్పుడు రోడ్ఢక్కాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. జగన్ 11 కీ.మీ రోడ్డు కూడా వేయలేక పోయాడు. మోడీ ఐకాన్ బ్రిడ్జి వేస్తున్నారు.. కోడూరు, మేదరమెట్ల రోడ్ కు టెండర్లు పిలిచారన్నారు. ఎపీలో అనేక వంతెనలు, జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చే జగన్ కు.. రోడ్లు వేసే దమ్ము లేదన్నారు. విజయవాడలో మూడు ఫ్లై ఓవర్లు, ఎయిమ్స్ కేంద్రం కట్టిందన్నారు. జగన్ కు దమ్ముంటే.. సిగ్గుంటే.. ముందు ఈ యూనివర్శిటీ ల వైపు వెళ్లే రోడ్లు వేయాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము జగన్ కి ఉందా? అని ఆయన నిలదీశారు. ప్రజలను పక్కదారి పట్టించే ఉద్యమాలను జగన్ మానుకోవాలని తీవ్ర విమర్శలు చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.