ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట మార్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న ప్రకటనపై 24 గంటలు కూడా గడవకముందే వెనక్కు తగ్గారు. తాను అలా అనలేదని, తన మాటలను మీడియా తప్పుగా అర్జం చేసుకుందని వివరణ ఇచ్చారు.తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, తమ మిత్రపక్షం జనసేన చీఫ్ పవన్ కలిసి సీఎం ఎవరనేది నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
కాగా నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ బీసీని ముఖ్యమంత్రి చేయగలవా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. సీఎం గురించి ప్రకటన చేసే అధికారం తనకు లేదని చెప్పారు. కానీ బీజేపీ ఆ పనిచేయగలదని అన్నారు.
నిన్న అలా మాట్లాడిన సోము వీర్రాజు.. వెంటనే ఇవాళ మళ్లీ మీడియా ముందుకొచ్చి తాను ఆ మాట మాట్లాడలేదని అనడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ బీసీ ముఖ్మమంత్రిని చేస్తుందని తాను అనలేదన్న వీర్రాజు.. వైసీపీ, టీడీపీలను ఎందుకు సవాల్ విసిరినట్టో అని ఆయా పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.