రాష్ట్రంలో బిజెపి ఏపీ నేతలది ఓ స్వరం.. జీవీఎల్, సోము వీర్రాజు బృందానిది మరో స్వరం.. ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మరో స్వరాన్ని వినిపించారు. అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ నే ఓ జోక్ గా కొట్టిపారేశారాయన. అలాగే.. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కి ఒకటే రాజధాని అయినప్పుడు.. ఇక్కడ మాత్రం మూడు ఎందుకు.. ఇది కేవలం అవినీతికి అవకాశం ఇవ్వడానికే అని తేల్చిపారేశారు. అంతేకాదు.. ఎక్కడా లేనట్లు నామినేషన్ల పర్వంలోనే దౌర్జన్యాలు జరిగిన రాష్ట్రం ఇదే.. ఈసారి మాత్రం మీరు అలాంటి దౌర్జన్యాలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మరో మాట కూడా చెప్పారు.. ప్రతి దానికి ఢిల్లీ ఏదో చేయాలని ఎదురు చూడకుండా.. మీరే రాష్ట్రంలో గట్టిగా పోరాడాలి.. వీధుల్లోకి రావాలని.. స్పష్టంగా చెప్పారు.
రాంమాధవ్ చెప్పిన సందేశం.. జీవీఎల్, సోమువీర్రాజు.. గత కొన్నిరోజులుగా మాట్లాడుతున్నదానికి భిన్నంగా ఉంది. జీవీఎల్ లేదా సోము వీర్రాజు.. ఎంతసేపు.. రాష్ట్రం మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయించుకుంది.. దానికి మనమేం చేస్తాం.. అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం అన్నారే గాని.. ఎక్కడా మూడు రాజధానులు తప్పుడు కాన్సెప్ట్.. అది అవినీతికి దారి తీస్తుందని కాని.. వైసీపీపై విమర్శలు మాత్రం చేయలేకపోయారు. ఆ విషయంలో చాలా మొహమాటపడ్డారు.
ఇప్పుడు రాంమాధవ్ మాట్లాడినదంతా బిజెపి సైద్ధాంతిక విధానమే. దానినే ఆయన ఉపన్యాసంగా ఇచ్చారు. ఇంతకీ ఆ బిజెపి సైద్ధాంతిక విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలోని సోమువీర్రాజు పూనుకుంటారా.. లేక తన రహస్య మిత్రుడు జగన్ నిర్దేశించిన అజెండాను అమలు చేయాలని చూస్తారా అనేది వేచి చూడాలి. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే.. రాంమాధవ్ సైతం.. అమరావతిని తరలించడం తప్పు అని గాని.. అది అన్యాయం అని గాని ఎక్కడా అనలేదు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని మనం పోరాడదామనే మాట కూడా చెప్పలేదు. అంటే అటు టీడీపీ నష్టపోవాలి… ఇటు వైసీపీని నష్టపర్చాలి అన్న తీరులో ఆయన చెప్పిన వ్యూహం కనపడుతోంది. అయితే జీవీఎల్, సోము వీర్రాజులు మాత్రం వైసీపీకి లాభం చేయాలనే ధ్యేయంతోనే పని చేస్తున్నట్లు కనపడుతోంది.
బిజెపి స్ట్రాటజీలో విజయవంతమైనది ఒకటే కనపడుతుంది. అది జనసేన. జనసేనను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడంలోను, పవన్ కల్యాణ్ ను తమ డైరెక్షన్ లోనే నడిపించడంలోను సక్సెస్ అయ్యారు.
కమలనాథులు.. అలా ఒక శక్తిని మాత్రం తమ గుప్పిట్లో పెట్టుకోగలిగారు. కాని అమరావతి వ్యవహారంలో తిరకాసు వ్యూహం అమలు చేయటంతో.. టీడీపీని హైజాక్ చేసే అవకాశాన్ని కోల్పోయారనే చెప్పాలి. అదే చేసుంటే… టీడీపీలో నాయకత్వంపై అసమ్మతి ఉన్నవారంతా బిజెపి వైపు రావడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కేవలం జనసేనపై ఆధారపడే.. ముందుకు పోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఇన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్న కమలనాథులు.. ఏపీ బీజేపి కార్యకర్తలను కన్ ఫ్యూజన్ లో పడేస్తున్నారనే చెప్పాలి.