రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి ఆందోళన
లెనిన్ సెంటర్, బీసెంట్ రోడ్‌లో భిక్షాటన చేసిన కన్నా లక్ష్మీనారాయణ
ఖాళీ గమేళాలతో కార్మికుల వినూత్న నిరసన
విజయవాడ: సెప్టెంబరు 5 ముహూర్తం అన్నారు.. అక్టోబర్ 7 వచ్చినా ఇసుక దొరకడం లేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఇసుక కొరత వల్ల లక్షలాది మంది కార్మికులు కష్టాలు పడుతున్నా సీఎం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వైసిపి కార్యకర్తలకు మాత్రం ఉద్యోగాలను పంచి పెట్టారని అన్నారు. ఇసుక కొరత తీర్చే వరకు కార్మికులకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు.
‘జగన్ తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి వరద పేరు చెబుతున్నారు. ఇసుక రీచ్ ల నుంచి కాకుండా స్టాక్ పాయింట్ల నుంచి ఇస్తామని చెప్పారు. రెండు నెలలు సరిపోయేలా స్టాక్ పెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇసుక కొరత తీరే వరకు కార్మికులకు అండగా పోరాడతాం.’ అని కన్నా చెప్పారు. లెనిన్ సెంటర్లో కన్నా లక్ష్మీనారాయణ భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన చేపట్టారు.