టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదాన్ని ఏపీ బీజేపీ వదిలేలా లేదు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని పోరుబాటకు సిద్ధమైంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నాకు దిగారు. పురపాలక సంస్థ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భైఠాయించారు.
బీజేపీ నేతలు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరకు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ చర్యపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను ఎందుకు అరెస్టు చేస్తారని నిలదీశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను అరెస్టు చేసే దమ్ములేని వైసీపీ ప్రభుత్వం.. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారాయన.