సాయం చేస్తామంటే...వద్దంటారేం..? హరిబాబు నిప్పులు

ఏపీకి కేంద్రం సాయం చేస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు. నిధులు ఇస్తామన్నా ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. దాదాపు రూ.16 వేల కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తామంటే తీసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఒకవేళ ఈ సాయాన్ని స్వీకరిస్తే.. హోదాకు బదులు ఇచ్చే ఆర్ధిక సాయాన్ని అందుకున్నారు కాబట్టి హోదా నినాదాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తాయన్న భయంతోనే ఇలా మోకాలడ్డుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి కేంద్రం చేసిన సాయంపై ఆదివారం విజయవాడలో  ఓ బుక్ లెట్ ను విడుదల చేసిన ఆయన. ఈ రాష్ట్రానికి హోదా కోరింది బీజేపీయేనని, హోదాతో కలిగే ప్రయోజనాలను నిదులరూపంలో ఇస్తున్నామని చెప్పారు.

‘ హోదా వల్ల కలిగే ప్రయోజనం సుమారు 16 వేల కోట్లు. అందులో భాగంగానే ఈ రాష్ట్రానికి 9 వేల కోట్లను కేంద్రం ఇచ్చింది ‘ అని హరిబాబు పేర్కొన్నారు. నాడు ప్రత్యేక ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారని,.దీనిపై అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారని, అయితే ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అర్థం కావడంలేదని అన్నారు. చంద్రబాబు సింగపూర్ వెళ్లి ప్రధాని మోదీని విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఏ నాయకుడైనా విదేశీ గడ్డపై ప్రధానిని విమర్శించిన సంప్రదాయం ఏనాడైనా ఉందా అని హరిబాబు విమర్శించారు. మోదీ ఉపవాస దీక్షను ప్రశ్నించిన చంద్రబాబు.. ఈ నెల 20 న దీక్ష చేస్తాననడంలో ఆంతర్యం ఏమిటన్నారు.