ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి పీక్స్ కు చేరింది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపించడంతో ప్రలోభాలు కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలని లక్ష్యంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం భేటీ అయ్యారు. తిరుపతిలోని మోహన్ బాబు నివాసంలో వీరి సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మోహన్ బాబును సోము కోరారు. గంట సేపు ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అనంతరం మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోహన్ బాబును మద్దతు కోరేందుకు వెళ్లినట్లు ఆయన చెప్పారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వీర్రాజు స్పందిస్తూ.. కిరణ్ కుమార్ రెడ్డి చాలా చురుకైన వ్యక్తి అని చెప్పారు.
మరోవైపు గత ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత తన కుటుంబంతో కలిసి ప్రధాని మోడీని కలిశారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చంద్రబాబును కలిశారు. దీంతో మోహన్ బాబు ఎవరికి సపోర్ట్ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మోహన్ బాబు ఎటు వైపు మొగ్గుతారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఎదురు చూడాల్సిందే.