గుంటూరు: కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఓకే చెప్పింది. కేబినెట్ ఆమోదం తెలపడంతో కొత్త ఇసుక విధానం 24 గంటల్లో అమల్లోకిరానుంది. టన్ను ఇసుక ధర రూ. 375 వుండాలని ప్రభుత్వం ఖరారు చేసింది. తొలిదశలో అందుబాటులోకి 58 ఇసుక స్టాక్ పాయింట్లు వచ్చాయి. ఏపీఎండీసీ ద్వారా ఆన్ లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. దశలవారీగా ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్లు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇలావుంటే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు ఇలావున్నాయి..
- నవయుగకు పోలవరం హైడల్‌ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
- రూ. 3216.11 కోట్ల టెండర్ రద్దుకు ఓకే
- రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు ఆమోదం
- కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి ఆమోదం
- మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
- ఆశావర్కర్ల వేతనం రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
- మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం.