గుంటూరు: ఆర్టీసీ ఉద్యోగులు సుమారు 50 వేల మందిని ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేసే ప్రజారవాణా శాఖలోకి వచ్చే మూడు మాసాల్లో విలీనం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అన్ని వసతులు, అవకాశాలు ఆర్టీసీ ఉద్యోగులకి వర్తిస్తాయి. ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లు చేశారు. మంత్రిమండలి ఆయా అంశాలపై చర్చించి తీసుకున్న నిర్ణయాలను సమాచార మంత్రి మీడియాకు వెల్లడించారు. నూతన ఇసుక పాలసీని మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు. మంత్రి తెలియజేసిన మంత్రిమండలి విశేషాలు ఇవీ..
13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటిని 70-80కి పెంచుతాం.
రీచ్‌ల్లోని ఇసుకకు టన్ను375 రూపాయలుగా ధర నిర్ణయించాం. కిలోమీటరుకు 4.90 రూపాయలకు ఇస్తాం.
ఎవరిదైనా రైతు పొలాల్లో ఇసుక ఉన్నట్టు తేలితే క్యూబిక్ మీటర్ కి 60 రూపాయల చొప్పున చెల్లిస్తూ ప్రభుత్వం ఇసుక తవ్వుతుంది.
ఇసుక మాఫియాను అరికడతాం. ఇసుకను ఎవరైనా నిల్వ చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకొంటాం.
ఇతర రాష్ట్రాలకు ఇసుక రావాణా నిషేధం.
ఆటో/ టాక్సీ సొంతంగా నడుపుకునే వారికి ఏడాదికి 10 వేలు ఇస్తాం. భార్యాభర్తలను ఒక యూనిట్‌గా లెక్కిస్తాం.
వైయస్సార్ పెళ్లికానుకను పెళ్లి రోజే అందిస్తాం. శ్రీరామనవమి నుంచి ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీలకు లక్ష, ఎస్టీలకు లక్షా 20 వేలు, బీసీలకు 50 వేలు చొప్పున ఇస్తాం. బీసీలు కులాంతర వివాహం అయితే 70 వేలు.. వికలాంగుల వివాహానికి లక్షా 50 వేలు.. భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహానికి లక్ష చొప్పున ఈ పెళ్లికానుక వర్తిస్తుంది.
2019 జనవరి నుంచి ఎన్నికలు అయ్యేంత వరకూ గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఆశా వర్కర్ల వేతనం విడుదల.
ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్న విద్యార్థుల కేసులు విత్ డ్రా చేస్తూ నిర్ణయం.
జాతీయస్థాయిలో ప్రతిభ చూపితే క్రీడాకారులకు గోల్డ్ మెడల్‌కు 5 లక్షలు.. సిల్వర్‌కు 4 లక్షలు.. కాంస్య పతాకాన్ని 3 లక్షలు అందిస్తాం.
ఆంధ్రా బ్యాంక్ విలీనం వల్ల ఆ పేరు యథాతథంగా ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం.
నడికుడి-శ్రీ కాళహస్తి బ్రాడ్ గేజ్ రైల్యే లైన్ కోసం ప్రకాశం జిల్లాలో 20 ఎకరాలు ద. మ. రైల్వేకు ఇవ్వాలని నిర్ణయం.
బలిమెల ఘటనలో అమరుడైన వెంకట్రావు కుటుంబానికి 10 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం.
టీటీడీ బోర్డు మెంబర్ల సంఖ్య 16 నుంచి 25కు పెంపు.
మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
నవయుగకు ఇచ్చిన పోలవరం హైడ్రో టెండర్ల రద్దు నిర్ణయానికి ఆమోదం.