ఏపీలో వరుస ఎన్నికలు రాబోతున్నాయి. తొలుత పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు.. ఆ తర్వాత పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిన్నటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానం ఆదేశాలు వెలువడగానే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15లోపు స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 15 తర్వాత రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో ఆలోపే పంచాయతీ, జడ్పీ, పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పంచాయతీలు, జడ్పీలు, పురపాలికల్లో ఓటరు జాబితాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తికావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. కోర్టు ఆదేశాలు వెలువడగానే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఏప్రిల్, మే నెలల్లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. జూన్ నాటికి నీటి సంఘాల ఎన్నికలను కూడా పూర్తి చేసి పూర్తిగా పాలనపై దృష్టి సారించాలని కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కుదింపు ఆలోచన కూడా దీనిలో భాగమేనని మంత్రులకు సీఎం జగన్ వివరించినట్లు సమాచారం. అయితే ప్రచారానికి సమయం సరిపోదంటూ కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. దీనిపై సీఎం స్పందిస్తూ సమయం సరిపోతుందని.. దానికి తగ్గట్టుగా సిద్ధం కావాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.