సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారీ పరిశ్రమల ఏర్పాటు, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ప్రతిపాదనలను కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపారు.
న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రి వర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 2 విడతల్లో రూ.1.10 లక్షల కోట్లతో న్యూఎనర్జీ పార్క్, 1000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం లభించింది.
అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ ఆధ్వర్యంలో న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడికి ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెట్టనుంది.
ఫేజ్ వన్‌లో భాగంగా రాష్ట్రంలోని 30 వేల మందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టి 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చే పత్రాలపై ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు అంగీకారం తెలిపింది. యూనిట్‌కు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.
వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు, బందర్ పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు ఓకే చెప్పింది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని నిర్ణయించింది. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.