ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. పంట నష్టంపై డిసెంబర్ 15లోపు అంచనాలను రూపొందించి.. డిసెంబర్ 30 నాటికి బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపింది. ప్రస్తుతం పునరావస శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున సాయం అందించనున్నట్టు వెల్లడించింది.
ఇక కరోనా కారణంగా ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోతలను డిసెంబర్, జనవరి నెలల్లో చెల్లిస్తామని తెలిపింది. డిసెంబర్ 25న పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తొలిదశలో 16లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది. ఆయా ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక డిసెంబర్ 15న వైఎస్‌ఆర్ పంటల బీమా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. త్వరలోనే అంగన్వాడీ, హోంగార్డుల వేతన బకాయిలు చెల్లించేందుకు కూడా కేబినెట్ నిర్ణయించింది.
డిసెంబర్ 2న ఏపీ అమూల్ ప్రాజెక్టు, డిసెంబర్ 10న మేకలు, గొర్రెల పంపిణీ కార్యక్రమాల ప్రారంభానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో డిసెంబర్ 21 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ గాంబ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు.. . ఏపీ గేమింగ్ యాక్ట్-1974 చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపింది. వీటితో పాటు మరిన్ని నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.