తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనుకున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి తామే అండగా నిలబడ్డామని గర్వంగా పొంగిపోయారు. తరతరాలుగా నమ్ముకున్న భూతల్లిని బాధపెడుతున్న, అంతకు మించి బాధ్యతగా భావించి రాజధాని కోసమంటూ ఇచ్చేశారు. రాజధాని నగరం అద్భుతంగా తయారవుతుందని.. అందులో ఉండే అవకాశంతో పాటు.. తమ పిల్లలకు బంగారు భవిష్యత్ దొరుకుతుందని అంచనాలు వేసుకున్నారు. అవునని, కాదని ఎన్నో సంవాదాలు నడిచినా.. అదే ఆశతో, ఆకాంక్షలతో ముందుకు సాగిపోయారు.
రాజకీయాల నడుమ రాజధాని నలిగిపోతుందని.. భవనాలు కట్టకముందే శిథిలాలు పలకరిస్తాయని అస్సలు ఊహించలేకపోయారు. పచ్చటి పైరు.. నల్లటి రోడ్డుగా మారినా.. కాస్త కలుక్కుమన్నా.. కలవరపడలేదు. కాని నేడు అంతా కకావికలం అవుతుంటే.. తల్లడిల్లిపోతున్నారు. అన్నం పెట్టడమే గాని.. మోసం చేయడం తెలియని అన్నదాతలు అయోమయంతో నేతల చుట్టూ తిరుగుతున్నారు.
అద్భుతంగా రాజధాని కడతానన్న చంద్రబాబునాయుడి మాటలు నమ్మినందుకు బాధపడాలో.. బాబును దెబ్బతీయడం కోసమే ధ్వంస రచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి మండిపడాలో.. అర్ధం కాని స్ధితిలో అమరావతి రైతులున్నారు. పంట పండే భూములను పణంగా పెట్టి రాష్ట్రం కోసం, తమ భావితరాల భవిష్యత్ కోసం తాము చేసిన త్యాగాన్ని కులం పేరుతో అవహేళన చేస్తున్న మంత్రులను చూసి కడుపు మండిపోతోంది. అయినా ఏమీ చేయలేని పరిస్ధితి. ఒక పథకం ప్రకారం ఒక్కో డైలాగు వదులుతూ, చర్చలు చేపట్టి.. అమరావతిని అభివృద్ధి చేసేది లేదని చెప్పకనే చెప్పేశారు అమాత్యులు.
ముఖ్యమంత్రి అయితే తన ప్రమాణస్వీకారంలోగాని, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారుల సమావేశాల్లో సైతం.. రాజధాని గురించి ప్రస్తావనే చేయలేదు. మౌలిక సదుపాయాల సంగతేంటో చెప్పనే లేదు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారనే విమర్శలు తప్ప, జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎక్కడా అమరావతి అనే పదాన్ని కూడా ఉచ్ఛరించలేదు. తాను నోరు మెదపకుండానే.. అమరావతి కాన్సెప్ట్ ను అత్యంత నాటకీయంగా చంపేశారు. ఇప్పుడు నిపుణుల కమిటీ పేరుతో మరో ప్రహసనం నడిపిస్తున్నారు.
భూములిచ్చినప్పుడు తమకొచ్చిన ప్లాట్లు మంచి ధర పలుకుతాయని.. నమ్ముకున్న నేల పోయినా.. మంచి ఆస్తితో పాటు, తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆశలు పెట్టుకున్న రైతులు.. నేడు ఆ ప్లాట్లు కనీస ధర కూడా లేకుండా పోవడంతో వారి గుండెల నిండా ఆవేదన గూడు కట్టుకుంది. కన్నీళ్లు సైతం కారటానికి మొహమాటపడుతున్నాయి.. కాని వారి హృదయాలు మాత్రం బాధతో బరువెక్కిపోయాయి. వారి ఆశలన్నీ ఇప్పుడు కేంద్రంపైనే ఉన్నాయి. కనీసం బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అయినా చొరవ చూపించి.. తమను ఆదుకుంటుందేమోనని ఆశతో ఎదురుచూపులు చూస్తున్నారు.