వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు. ఇద్దరూ ఒకే జనరేషన్. ఇదరూ సీఎంలుగా పని చేశారు. వైఎస్ తనను నమ్ముకున్న మనుషులను ఎలాగైనా కాపాడతారని.. వారిని బాగా చూసుకుంటారని పేరు. చంద్రబాబు.. మాత్రం తనను నమ్మినవారిని కూడా నమ్మరనేది పేరు. ఆయన అవసరాలకు అనుగుణంగా అనుబంధాలు మార్చేసుకుంటారని చెప్పుకుంటారు. తప్పు చేసినా, నేరం చేసినా.. వాడు మనవాడు అయితే చాలు.. ఏం కాదు.. ఏదో ఒకటి చేసి.. మనోడిని బయటకు తెండి.. అనేది వైఎస్ స్టైల్. అంత నేరం చేశాక.. మనం బయటకు తీసుకొస్తే.. మన మీద విమర్శలొస్తాయి.. తర్వాత చూద్దాం అనేది బాబు స్టైల్. ఎవరూ అడగనంతసేపు ఓకె.. రచ్చ అయితే మాత్రం ఎస్కేప్ అనేది బాబుగారి స్టయిల్. కాని షాకింగ్ రేంజ్ లో పవర్ చేతిలోంచి పోయాక.. చంద్రబాబు కూడా మారిపోయినట్లు కనపడుతోంది. నేను కూడా విశ్వసనీయత చూపించాలని అనుకుంటున్నట్లు అర్ధమవుతోంది.
చింతమనేని ప్రభాకర్. టీడీపీ హయాంలో విప్ గా చేశారు. పశ్చిమగోదావరిలో పార్టీకి బలమైన నేత. అందుకే ఆయన ఎన్ని చేసినా.. చంద్రబాబు నోరు విప్పలేదు. తప్పనీ చెప్పలేదు.. ఒప్పనీ ఒప్పుకోలేదు. పోలీసులకు మాత్రం కేసు పెట్టడానికి, అరెస్టు చేయడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. టీడీపీపై వ్యతిరేకత పెరగడానికి.. చింతమనేని ఎపిసోడ్ కూడా ఒకానొక కారణం.
వైసీపీ అధికారంలోకి రాగానే.. చింతమనేనిపై పెండింగ్ ఉన్న కేసులన్నీ ఒకటొకటి.. వరుసగా బెయిల్ రాకుండా చేస్తూ.. రిమాండ్ లోనే కంటిన్యూ చేశారు. మొత్తం మీద చివరికి 13 కేసుల తర్వాత చింతమనేనికి బెయిల్ దొరికింది.
మాజీ స్పీకర్ కోడెలపై ఆరోపణలు రాగానే.. కాస్త మౌనం పాటించిన చంద్రబాబు.. ఆయన సూసైడ్ చేసుకోవడంతో షాక్ తిన్నారు. అందుకే రూటు మార్చినట్లున్నారు. చింతమనేనిని బహిరంగంగా సమర్ధించారు. తప్పుడు కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. కావాలనే వైసీపీ వేధిస్తుందంటూ మండిపడ్డారు. ఆ నియోజకవర్గంలో ఏమో గాని… మీడియాలో చింతమనేని న్యూస్ చూస్తున్నవారు మాత్రం తగిన శాస్తి జరిగిందనే భావనలోనే ఉన్నారు. అలాంటి నేతను చంద్రబాబు నెత్తికెక్కించుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చంద్రబాబు ధోరణికి ఇది విరుద్ధమైనది.
వైసీపీ సైతం ఇదే అస్త్రంగా చేసుకుని.. చంద్రబాబు మీద విమర్శలు కురిపిస్తున్నారు. చింతమనేనిని కూడా సమర్ధించారంటే.. చంద్రబాబుకు ఏమైందంటూ వారే ప్రశ్నలు వేస్తున్నారు.
మనకు అండగా ఉండేవాళ్లు.. ఎలాంటివారైనా సరే.. ఎన్ని కేసులున్నా సరే.. కవర్ చేసుకోవడం కాదు.. డైరెక్టుగానే అతను నా మనిషి అని చెప్పేసుకోవాలని బాబు డిసైడైపోయినట్లే కనపడుతుంది. అందుకే కేసులు ఎలాంటివైనా.. ఏ సందర్భంగా పెట్టినా సరే.. టీడీపీ నేతలపై కేసు అంటే చాలు.. అధికార పార్టీ వేధింపులంటూ నాయుడుగారు మండిపడిపోతున్నారు. ఏ మీటింగ్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా.. కేసుల గురించి ప్రస్తావించకుండా ఉండటం లేదు.