బాబు మళ్ళీ హర్ట్ అయ్యారు!

ప్రతిపక్ష వైసీపీ లేని బడ్జెట్ సెషన్లో చంద్రబాబు ఏకపాత్రాభినయమే నడుస్తోందంటూ ఒకటే విమర్శలు. ”ఢిల్లీకి 21 సార్లు వెళ్ళాను, మోదీని గడ్డం పట్టుకు బతిమాలాను.. ఎవ్వరి కోసం? నా కోసం కాదు నా కుటుంబం కోసం కాదు.. మన రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం..” ఈ స్టేట్మెంట్ గత వారం రోజుల్లో కనీసం అరడజను సార్లయినా రీసౌండ్ ఇచ్చి ఉంటుంది. అసెంబ్లీలో ఎమోషన్ ని పండించడంలో చంద్రబాబు పడ్తున్న ప్రయాస ఇటీవలికాలంలో రెట్టింపయ్యిన మాట కూడా నిజం. ”దేశంలో ఇప్పుడున్న పొలిటీషియన్లందరిలోకీ నేనే సూపర్ సీనియర్‌ని.. ప్రధానమంత్రుల్ని డిసైడ్ చేసినవాడ్ని.. ఎన్నో ప్రభుత్వాల్ని చూసినవాడ్ని..” ఇలా తమ అధినేత పాల్పడుతున్న సెల్ఫ్ ఎక్స్ పోజింగ్ సైతం మోతాదుకు మించుతోందని, పదేపదే రిపీట్ అవుతోందని తెలుగుదేశం నేతలే గొణుక్కుంటున్నారు.

మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశంలో.. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు చేసిన సర్కాస్టిజానికి బాగా హర్ట్ అయ్యారు ఏపీ సీఎం. ”భావితరాల అభ్యున్నతికి ఉపయోగపడేలా నేను ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కోసం తపన పడుతుంటే.. దాన్ని ఎగతాళి చెయ్యడం సబబేనా?” అన్నప్పుడు బాబు కళ్ళు చెమర్చాయి. కళ్లజోళ్లు చేతికి తీసుకుని కన్నీళ్లు తుడుచుకున్నారు కూడా. బాబుకు భావోద్వేగం పొంగుకురావడం కొత్తేమీ కాకపోయినప్పటికీ.. ఈసారి మాత్రం తన పెర్ఫామెన్స్ లెవెల్స్ ని బాగా పెంచేశారంటూ కామెంట్లు పడిపోతున్నాయి.

‘బాబూ ఇప్పుడేడిస్తే ఏం లాభం?’ అంటూ దెప్పిపొడుపులూ మొదలయ్యాయి. పాదయాత్రలో జనాన్ని దువ్వడంలో వైసీపీ అధినేత పడ్తున్న పాట్లతో పోలిస్తే.. అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత ఫీట్లు గొప్పగా ఏమీ లేవనేవాళ్ళూ లేకపోరు. వీళ్ళ ఏడుపులు, పెడబొబ్బలు ఢిల్లీలోని ‘పెద్ద చెవులకు’ సోకుతున్నాయా అనేదే అసలు ప్రశ్న!