జగన్మోహన్ రెడ్డి ఒక్కో అడుగు చూస్తుంటే.. ఒక్కో నిర్ణయం చూస్తుంటే.. అమరావతిపై ఎంత పగబట్టారబ్బా అనిపిస్తుంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతి లేక మద్దతు పలకడమే తప్ప.. అమరావతి అంటే ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది. తప్పదు కాబట్టే.. అక్కడ కొనసాగిస్తామనే ప్రచారం చేశారు తప్ప.. దానిని నాశనం చేయాలని ఎప్పటి నుంచో కంకణం కట్టుకున్నట్లు.. జగన్ వైఖరిని చూస్తేనే అర్ధమైపోతోంది. మంగళగిరి, తాడేపల్లి అభివృద్ధిపై చేసిన ప్రకటన చూస్తుంటే అలాగే ఉంది. ఈయనది అనావృష్టి అయితే.. చంద్రబాబుది అతివృష్టి.. రాజధానికి అవసరమైనవన్నీ చకచకా పూర్తి చేయకుండా.. అద్భుతంగా చేయాలంటూ.. చాలా టైమ్ తీసుకున్నారు. ఈలోపు ఆయన అధికారం పోయింది.
అలాంటి అమరావతి కృష్ణానది వరద ప్రాంతం అని కాసేపు.. అక్కడ నిర్మాణాలకు ఖర్చెక్కువ అవుతుందని కాసేపు.. ఇలా ఒక్కో రాయి విసురుతూ వచ్చారు వైసీపీ నేతలు. అప్పటికే పూర్తి కావచ్చిన బిల్డింగులను సైతం.. ఆపేశారు. హ్యాపీ నెస్ట్ అంటూ ఫ్లాట్లు అమ్మి డబ్బులు తీసుకున్నాకూడా.. దానిని కూడా కట్టకుండా ఆపేశారు. కనీసం పెయింట్ కూడా వేయనివ్వకుండా నిలిపివేశారు. రోడ్లు, డ్రైనేజీ.. ఒక్కటేంటి.. అన్ని పనులను ఆపేయడమే కాదు.. ఆ బిల్లులను కాంట్రాక్టర్లకు ఇవ్వడం కూడా ఆపేశారు. అలా మొదటి అడుగులో అమరావతిని తొక్కిపెట్టేశారు.
ఆ తర్వాత ఆ మాట ఈ మాట చెబుతూ.. చివరికి మూడు రాజధానుల ముచ్చట ముందుకు తెచ్చి.. అమరావతిలో కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తేల్చేశారు. ఇక దానిపై ఎంత కథ నడిచి.. చివరకు ఎంతవరకు వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం.. అమరావతిలో ఇప్పటివరకు కట్టిన బిల్డింగులను ఏం చేస్తుందో చెప్పటం లేదు. ఆఫీసులు పెడతారా అంటే.. అన్నీ విశాఖలో పెడతారు కాబట్టి.. దానికి ఛాన్స్ లేదు. కమర్షియల్ గా ఎవరికైనా అమ్మటమో, రెంట్లు ఇవ్వడమో చేయాలంటే.. అవి ప్రధాన రహదారులకు దూరంగా.. లోపలకి ఉన్నాయి.. అన్నీ అనుకున్నట్లు పనులు జరిగితే.. వాటికి ఫుల్ డిమాండ్ ఉండేది.. ఇప్పుడు ఆ ఏరియాకు వచ్చి తీసుకునే అమాయకులు ఎవరుంటారు.. ఎవరూ రారు. కాబట్టి అదీ కుదరదు. అయినా గాని వాటి గురించి పట్టించుకోకుండా.. ఇప్పుడు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంపై దృష్టి పెట్టారు.
మంగళగిరి, తాడేపల్లి పట్టణాలను ఆధునీకరించడానికి 1100 కోట్లపైనే బడ్జెట్ కేటాయించారు. తాజాగా ఓ 28 కోట్లు రిలీజ్ చేశారు. అంటే అమరావతి కోర్ ఏరియా లోపలకు ఉంటే.. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు.. ప్రధాన రహదారిపై ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే.. లోకల్ గా ఉండే వైసీపీ నేతలకు.. వారికి మద్దతిస్తున్న వారి సామాజికవర్గానికి భారీగా మేలు జరిగే అవకాశం ఉంది. ఈ పేరుతో బూస్టప్ చేసి.. విజయవాడ గుంటూరు రహదారిపై ఉన్న రియల్ ఎస్టేట్ వారితో డీల్ కుదుర్చుకుని వసూళ్లు చేసుకోవడానికి కూడా రంగం సిద్ధమైంది. ప్రాంతీయ అభివృద్ధి మండలి కార్యాలయాలను కూడా ఇదే రోడ్డుపై నాగార్జున యూనివర్శిటీలో పెట్టే ఆలోచన లేదా.. కాజ దగ్గర్లోని ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ లో పెట్టే ఆలోచన చేస్తున్నారు.. ఆ విధంగా మొత్తం అభివృద్ధి అంతా.. విజయవాడ గుంటూరు రోడ్డుకు పరిమితం చేసి.. అటు అమరావతి, దాని చుట్టుపక్కల గ్రామాలు.. అంటే ఏవైతే రాజధానిలో భాగమైన గ్రామాలో.. అవన్నీ.. ఇక మళ్లీ పొలాలుగానే మిగిలిపోతాయి.. పైగా ఇప్పుడు సీఆర్డీయే రద్దు నేఫథ్యంలో.. రైతుల పరిస్ధితి ఏమవుతోందో, న్యాయపోరాటం ఏమవుతుందో.. అంతా అగమ్యగోచరమే. అలా జగన్ పగబట్టి మరీ అమరావతిని సాధిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.