కేసీఆర్‌ను చూసి జగన్ వాతలు పెట్టుకుంటున్నారా…? కేసీఆర్ ఫార్మూలా జగన్‌కు బ్యాక్ ఫైర్ కానుందా…? కేసీఆర్ అడుగులో అడుగేస్తూ వస్తున్న జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిని తాకట్టుపెట్టబోతున్నారా…?
కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ… పెద్దన్న వెనక ఉంటానంటున్న జగన్‌కు ఆ ఆలోచనే ఎదురు తిరగబోతున్నట్లుగా కనపడుతోంది. జగన్ వేస్తున్న అడుగులు…జగన్‌కు అనుకున్నంత మైలేజీ అయితే తెచ్చిపెట్టెలా కనపడటం లేదు. కానీ జగన్ మాత్రం ఆ అంశం చుట్టూనే తిరుగుతున్నారు.
కేసీఆర్ సీఎం అయ్యాక… ఏడారిలాంటి తెలంగాణకు నీటిని పరిచయం చేయాలన్న ఆశ చూపాడు. తెలంగాణలో ఒకటి రెండు జిల్లాలకు మినహ పెద్దగా నీటి కాలువల పరిచయం లేదు. అందుకే కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రంగా సాగునీటి ప్రాజెక్టులను తెరపైకి తెచ్చాడు. వరుసగా రెండోసారి విజయానికి బాటలు వేసుకున్నాడు. ఆ ప్రాజెక్టులు సక్సెస్ రేట్ పక్కన పెడితే… కేసీఆర్‌కు మాత్రం సక్సెస్ ఇచ్చింది.
జగన్ కూడా ఇదే ఫార్మూలాను అనుసరించే పనిలో ఉన్నారు. తెలంగాణతో ఉమ్మడిగా సాగునీటి ప్రాజెక్టు కోసం ప్రయత్నించినా… అది పట్టాలెక్కేలా లేదు. దాంతో గుంటూరు జిల్లాలో… దాదాపు 130టీఎంసీల భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది ఏపీ క్యాబినెట్. ఇంతవరకు బాగానే ఉన్నా… జగన్ వేస్తున్న సాగునీటి అడుగులు కేసీఆర్‌కు వచ్చిన మైలేజీ తెస్తుందా అనేదే అసలు ప్రశ్న.
ఏపీలో తెలంగాణతో పోలిస్తే… సాగునీటి ప్రాజెక్టులు, నీటి కాలువలు కొంత ఎక్కువే. రాయలసీమను పక్కనపెడితే… ఆంధ్రా జిల్లాలో బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసే వారు తక్కువ. కానీ జగన్ మాత్రం ఇప్పటికే పరిచయమున్న సాగునీటి ప్రాజెక్టులు అందులోనూ కొత్త ప్రాజెక్టులపై పడ్డారు. పోలవరాన్ని అటకెక్కించి, కొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానం అంటూ చెప్తున్నా అవి ఆచరణ సాధ్యంపై అనేక అనుమానాలున్నాయి.
అంటే… కేసీఆర్ బాటలో జగన్ సాగునీటి ప్రాజెక్టుల కోసం అడుగులేస్తున్నారు. కానీ కేసీఆర్‌కు ఇచ్చిన రెండోసారి అధికారం జగన్‌కు దక్కుతుందా అంటే… చెప్పేందుకు ఇంకాస్త టైం పడుతుంది. కానీ కేసీఆర్‌కు వచ్చిన హైప్ మాత్రం ఖచ్చితంగా రాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.