గన్ పేల్చలేదు.. బుల్లెట్లు వదల్లేదు.. కాని గన్ చూపించారు. కత్తి చూపించారు.. రక్తపు చుక్క కారలేదు. పోలీసు వచ్చి తలుపు కొట్టలేదు. కాని గుమ్మం ఎదురుగా నిలబడ్డాడు. సంకెళ్లు చేతికి పడలేదు.. కాని కంటి ముందే వేలాడదీశారు. అరవలేదు.. కొట్టలేదు.. దాడి అసలే చేయలేదు.. జస్ట్ ఓ కాగితం చూపించి.. దాని మీద స్టాంప్ వేశారు. అంతే. వారనుకున్న పని అయిపోయింది. కేకు కట్ చేసినంత స్మూత్ గా జర్నలిస్టుల స్వేచ్ఛను కట్ చేసేశారు. కలాన్ని జస్ట్ భయపెట్టి.. కథ నడిపించేశారు.
ఏ జర్నలిస్టు అయినా.. ఏదైనా స్టోరీ రాసేటప్పుడు.. అవి ఓ రాజకీయనాయకుడు, అధికారి లేదా ఓ డిపార్ట్ మెంట్ మీద ఆరోపణలు చేసినప్పుడు.. వారి వివరణ కూడా తీసుకోవాలనేది ప్రాథమిక సూత్రం. ఇప్పుడు కొందరు పాటిస్తున్నారు. కొందరు పాటించడం లేదు. పాటించాలనుకున్నవారికి.. అవతలి వారు సహకరించడం అనేది ఎటూ లేదు. అందుకే సమాధానం చెప్పలేదని రాసుకుంటున్నారు. ఇది ఏ కోర్టులోనైనా కేసు వేసుకోగలిగిందే. దీనికి ఎటూ అవకాశం ఉంది. అయినా ప్రత్యేక జీవో ఎందుకు తెచ్చారో తెలుసుకుంటే అసలు విషయం తెలుస్తోంది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్ర జ్యోతి తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, వారిని కట్టడి చేయడానికి ఓ జీవో తీసుకొచ్చారు. అందులో సమాచార శాఖ కమిషనర్ ఏదైనా తప్పుడు వార్తగా భావిస్తే కేసు వేయవచ్చని పెట్టారు. కాని దానిని వాడింది లేదు, పెట్టింది లేదు. తర్వాత ఆ జీవో లేదన్నట్లే వ్యవహరించారు. ఇప్పుడా జీవో దుమ్ము దులిపి బయటకు తీశారు. కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టారు. వారు చర్చించిన విషయం వారు చెప్పందే ఎవరికీ తెలియదు కదా. వారే కావాలని లీకు ఇచ్చి.. దానిపై చర్చ జరిగినట్లు వార్తలిచ్చారు. ఇంకేముంది దానిపై చర్చ మొదలైంది.
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా అంటూ ప్రతిపక్షాలు, జర్నలిస్ట్ యూనియన్లు విరుచుకుపడ్డాయి. అధికారపక్షం మేం చర్చించాం అంతే అని తేలిగ్గా చెప్పింది. కాని నెల తర్వాత తాము చేసిన చర్చను నిజం చేస్తూ.. సమాచార శాఖ కమిషనర్ కాకుండా.. ఏ డిపార్ట్ మెంట్ మీద ఆరోపణ వార్త రాస్తే.. ఆ డిపార్ట్ మెంట్ అధికారి కేసు వేసుకోవచ్చని మార్చారు. మారుస్తూ కొత్త జీవో 2403 ఇచ్చేశారు. అందరూ తీవ్రంగా మండిపడ్డారు. మీరు తప్పు చేస్తే కదా.. తప్పుడు వార్త రాస్తే కదా.. ఎందుకు ఆందోళన చెందుతారు. తప్పుడు వార్తలు రాసేవాళ్లు భయపడాలి. మీరు కాదు.. అంటూ అందరికీ తెలివిగా సమాధానం చెప్పారు మంత్రులు.
ఇక సలహాదారులుగా నియమించబడ్డ సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, దేవులపల్ల అమర్ లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆ జీవోను సమర్ధించుకొచ్చారు. తప్పుడు వార్త రాయడం జర్నలిస్టు హక్కు కాదని.. అలా రాసినప్పుడు చర్య తప్పదని వారు వివరించారు.. ఇది ఎప్పటి నుంచో ఉందని.. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని కూడా చెప్పారు. వారు చెప్పింది నిజమే అనుకోవాలి. ఎందుకంటే ఉన్నదాని మీదే.. ఇంత చర్చ రేపారంటే దాని వెనుక ఏముందో ఆలోచించాలి. ఈ చర్చ అంతా జరిగాక.. ఇప్పుడు అనేకమంది జర్నలిస్టులు ఏదైనా విమర్శనాత్మక వార్త రాయాలంటే భయపడుతున్నారు. ఇది వాస్తవం. ఎందుకొచ్చింది.. ఏం నోటీసు వస్తుందో.. అని ఆలోచనలో పడుతున్నారు. ఎడిటర్లు, మేనేజ్ మెంట్లు సైతం ఏది పడితే అది రాయకండి అంటూ వార్నింగులు కూడా ఇచ్చేశారు.
రాజకీయంగా బద్ధ వ్యతిరేకులైన మీడియా సంస్థలు తప్పా… న్యూట్రల్ గా ఉండే మీడియా సైతం ఈ పరిణామాల తర్వాత ఆలోచనలో పడ్డారు. అనవసరంగా రిస్క్ ఎందుకనే డైలాగులు చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. కాని కొందరు జర్నలిస్టులు మాత్రం.. ఇంత ఘోరమా? ఇలా జీవో తెస్తే కూడా ఏమీ చేయలేకపోయాం. దీనికే మన మేనేజ్ మెంట్లు భయపడితే.. ఇక మనకు రక్షణ ఏముంటుంది? అని ఆవేదన చెందుతున్నారు.
మొత్తం మీద అలా ఉన్న జీవోకు దుమ్ము దులిపి, చర్చ పెట్టించి.. అందరికీ అర్ధమయ్యేలా, తెలిసేలా వార్నింగ్ ఇచ్చేసి.. తమ పని కానించేశారు వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాని రేపు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రం, ఏ జర్నలిస్టు ఆగడనే విషయం మాత్రం పెద్దలు గుర్తుంచుకోవాలి.