ప్రజల కోసం ఏపీలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్ట్‌లో మళ్లీ అదే పైపుల కంపెనీకి దక్కుతుందా…? ఆ పైపుల కంపెనీ కోసమే ఈ కొత్త ప్రాజెక్టా…? అందులోనూ తెలంగాణ పథకమే రోల్ మాడలా…? మరీ తెలంగాణలో వచ్చిన అవినీతి కంపు మాటేమిటీ…? ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న కొత్త ప్రాజెక్ట్‌పై తొలివెలుగు ఎక్స్లూజివ్ స్టోరీ.
ఎండకాలం వస్తే చాలు… తాగునీటికి కటకట. బోర్లు ఎండిపోతుంటాయి. కొత్తగా బోర్లు వేద్దామంటే సక్సెస్ కావు. ఇప్పుడిదే కాన్సెప్ట్ కాంట్రాక్టర్లకు కాసుల పంటలు కురిపించబోతున్నాయి. అవును.. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తాం అని ప్రచారం చేశారు. పథకం పూర్తిచేయకపోతే ఓట్లే అడగ అంటూ వేల కోట్లు ఖర్చుచేశారు. కానీ ఆ పథకంపై ప్రతిపక్షాల నుండి అనేక ఆరోపణలు వచ్చాయి. పైపుల కంపెనీలకు, మెఘా కంపెనీకి దోచిపెట్టడానికే 40వేల కోట్ల ఖర్చు అంటూ ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదు. ఆ ప్రాజెక్ట్ అలా సాగుతూ… వస్తోంది. ప్రభుత్వ లెక్కల్లో ప్రాజెక్ట్ సక్సెస్… జనం లెక్కలో నీళ్లు అంతంత మాత్రమే.
ఇప్పుడు ఏపీలోనూ జగన్ కేసీఆర్‌ను ఫాలోకాబోతున్నారు. తెలంగాణలో మిషన్ భగీరథలాగే… ఏపీలోనూ మంచినీళ్ల కోసం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పుడెవరయినా విమర్శించినా… అవును పేద ప్రజల తాగు నీటి కోసం 46వేల కోట్లేంటీ… ఎక్కువైనా భరిస్తాం అంటూ కేసీఆర్ మాదిరిగానే స్పీచులిచ్చేందుకూ రెడీ అయిపోయారు.
అవును… ఏపీలోనూ మిషన్‌భగీరథ పథకం రూపుదిద్దుకుంటోంది. 2022లోపు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయటమే లక్ష్యంగా, 46,600కోట్లతో ప్రతి గ్రామం, తండా… గిరిజన గూడెంలకు నీరిస్తాం అంటూ ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఎండకాలం గొంతెండొద్దు అంటూ లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఈప్రాజెక్ట్ పథక రచన నడుస్తున్నట్లు సమాచారం.
మంచినీటి పథకం అంటే… ఎలాగు పైపుల కంపెనీలు వచ్చేస్తాయి. పైగా మిషన్ భగీరథలో మెఘా కంపెనీ అనుభవం ఉంది. పేరుకు ఆన్‌లైన్ టెండర్స్ అన్నప్పటికీ, ఎంత లైన్‌గా అనుకున్నవారికి కట్టబెట్టొచ్చే… మన తెలుగు రాష్ట్రాల సీఎంల కంటే బాగా ఎవరికి తెలుస్తుంది, సో… ఈ ప్రాజెక్ట్ కూడా మెఘా ఖాతాలోకి వెళ్లటం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయినా… మంచినీరే అందించాలంటే ఇప్పుడున్న నీటి వనరులను, ఇప్పటికే ఆధారపడ్డ వనరులను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలి కానీ, ఇన్ని వేల కోట్లతో స్వలాభం చూడకుండా… ప్రజల లాభం చూసే ఉద్దేశం ఉంటుందా అని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.