ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 13 జిల్లాలు 26గా మారిపోయాయి. ఈ మేరకు అధికారికంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి.. కొత్త జిల్లాలను ఒక్కొక్కటిగా వర్చువల్ గా ప్రారంభించారు సీఎం జగన్. రాష్ట్రంలో దాదాపు 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది.
సోమవారం నుంచి 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు సీఎం జగన్. పరిపాలనా సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే జిల్లాల పేర్లను పెట్టినట్లు తెలిపారు. గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉంటాయని.. ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాను ఏర్పాటుచేశామన్నారు.
ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని గ్రామస్థాయి నుంచి చూశామన్న జగన్… ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా వికేంద్రీకరణ చేస్తున్నామని తెలిపారు. తమ తమ బాధ్యతలను స్వీకరించి.. పనులు ప్రారంభిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలియజేశారు.
కొత్తగా ఏర్పాటైన జిల్లాలు
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి
పాత జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం