వైయస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలని ఏపీ సీయం జగన్మోహన్‌రెడ్డి ప్రధానిని ఆహ్వానించారు. దాదాపు గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు.
న్యూఢిల్లీ: ముఖ్యంగా అదనపు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం సీయం విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.61,071.51 కోట్ల రూపాయలు అవసరమవుతాయని గత ప్రభుత్వం ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్లో పేర్కొంది. కానీ ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమేనని, గత ప్రభుత్వం వివిధ పనులు, బిల్లులకు సంబంధించి రూ.50 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టిందని, సకాలంలో నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సీయం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వీటికి అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని కోరారు.
రెవెన్యూ లోటు అంశం కూడా సీయం ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. 2014–15లో రాష్ట్రాన్ని విభజించిన సమయంలో రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా కాగ్ అంచనా వేసిందని, ఇప్పటి వరకూ రూ.3,979.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, ఇంకా రూ.18,969.26 కోట్లు రావాల్సి ఉందని వివరిస్తూ.. రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన రూ.18,969.26 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా జగన్ ప్రధానిని కోరారు.
పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలు ఆమోదించాలని జగన్ ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు రూ.5,103 కోట్లను ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిందని, ఆ నిధులను తక్షణమే రీయింబర్స్ చేయాల్సి ఉందని చెప్పారు. ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి మరో రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉందని, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మొత్తం రూ. 55,548 కోట్లు ఆమోదించాలని కోరుతున్నామని అన్నారు. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రధానికి వివరించారు.
ఇక, రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.838 కోట్లు ఆదా అయ్యాయని సీయం ఈ భేటీలో ప్రధానికి చెప్పారు. 2014–19 మధ్య పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ వేశామని, ఆ నిపుణుల కమిటీ అభిప్రాయం మేరకు పాత కాంట్రాక్ట్‌లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌ను నిర్వహించడం ద్వారా రూ.838 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు.
ఇంకా, సీయం ఈ సమావేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసిి తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు చేయాల్సిన ఆర్థిక సాయం, నవరత్నాలకు చేయూత.. తదితర అంశాల గురించి ప్రస్తావించారు. పనిలో పనిగా పీయంని కలిసినప్పుడల్లా అడుగుతూనే వుంటానని చెప్పిన ప్రత్యేక హోదా అంశం కూడా మరచిపోకుండా అడిగారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి మీకు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. పరిశ్రమలకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వకపోతే సహజంగా పెట్టుబడిదారులు మెట్రో నగరాలైన చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వైపు చూస్తారని సీయం జగన్ ప్రధానమంత్రికి వివరించారు. పీఎం ఈ అంశాలన్నీ ఎంతో ఆసక్తిగా విన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఏపీ ఎంత నష్టపోతుందో జగన్ ఎంతో వివరంగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.