రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్…దుబారా ఖర్చులకు మాత్రం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. తన తండ్రి సమాధికి ఏకంగా 27 కోట్లపై పైగా నిధులు మంజూరు చేసి విమర్శల పాలవుతున్నారు. కడప జిల్లా వేములపల్లి మండలం ఇడుపులపాయ గ్రామంలోని రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీలో గల సీఎం తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సమాధిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం మౌళిక సౌకర్యాలకు ఏకంగా 27 కోట్ల 7 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది.
వైఎస్సార్ సమాధి పరిసర ప్రాంతాల సుందరీకరణ, సమాధికి వెళ్లే దారి (10 కిలో మీటర్లు) సుందరీకరణ, సమీపంలోని ట్రిపుల్ ఐటీ లో పచ్చదనం కోసం ఈ నిధులు కేటాయించాల్సిందిగా ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ పంపిన ప్రతిపాదనలను ఓకే చేసి పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసింది. దేశంలో ఆర్ధిక మందగమనం కొనసాగుతోన్న ఈ సమయంలో ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకుంటూ బడ్జెట్ ను చాలా పొదుపుగా వాడుకోవాల్సిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి తండ్రి సమాధి కోసం కోట్లలో నిధులు విడుదల చేయడం చూసి ఆశ్యర్య పోతున్నారు.