నెల్లూరు జిల్లాలోని కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో జోగునాథునిపాలెం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఫొటో షూట్ కోసం, డ్రోన్ షాట్స్ కోసమే చంద్రబాబు కందుకూరు సభ అని మండిపడ్డారు. ఆ సభలో అన్యాయంగా 8 మందిని చంపేశారని దుయ్యబట్టారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లోనూ షూటింగ్ కోసం 29 మంది ప్రాణాలు తీశారని విమర్శించారు.
అప్పుడు కూడా ప్రజలు ‘ఇదేం ఖర్మరా బాబు’ అనుకున్నారని సెటైర్లు వేశారు. రాజకీయం అంటే షూటింగులు, డైలాగులు, డ్రోన్ షాట్లు కాదని చురకలు అంటించారు. రాజకీయం అంటే డ్రామాలు అంతకంటే కాదన్నారు. పేద కుటుంబాల్లో మంచి మార్పు తీసుకురావడమే రాజకీయమని సీఎం జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతుందోని.. ఏ మంచి జరిగినా తానే చేశానని చెప్పుకోవడం ఆయన నైజమన్నారు. చివరకు పీవీ సింధు బ్యాడ్మింటన్ లో గెలిచినా.. ఆమెకు ఆడటం నేర్పించింది తానేనని చెప్పుకుంటాడని ఎద్దేవా చేశారు. ఇది చంద్రబాబు మార్క్ స్టైల్ అని ఆరోపించారు.
73 ఏళ్ల ముసలాయనను చూస్తే గుర్తొచ్చేవి రెండే స్కీములు.. ఒకటి వెన్నుపోటు.. రెండు మోసాలు అని దుయ్యబట్టారు. రూ.986 కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని.. మెడికల్ కాలేజీ వస్తే 150 మెడికల్ సీట్లు వస్తాయన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుందని అని వెల్లడించారు సీఎం జగన్.