టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన కోట్లాది రూపాయల భారాన్ని తామే మోశామన్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించారాయన. రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు.
తమ ప్రభుత్వం వచ్చాక గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలని చెప్పారు జగన్. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. రోజుకో మెనూతో జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ అమూల్ పాల వెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా రూ.9వేల కోట్లు ఇచ్చినట్లు వివరించారు.
Advertisements
వ్యవసాయ రంగానికి రూ.83వేల కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్. ధాన్యం సేకరణ, కొనుగోళ్ల కోసం రూ.33వేల కోట్లు ఖర్చు చేశామని.. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలతో పాటు చెల్లించకుండా వదిలేసిన రూ.9వేల కోట్ల ఉచిత విద్యుత్, రూ.324 కోట్ల విత్తన బకాయిల భారాన్ని తామే మోశామని వివరించారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమన్న జగన్.. 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు.