రాక రాక అధికారం వచ్చింది. అధినేత అవినీతిని నిర్మూలిస్తానంటున్నాడు విచిత్రంగా. టిక్కెట్ అడిగినప్పుడు పది ఉన్నాయా.. ఇరవై ఉన్నాయా.. అవి లేకపోతే కుదరదన్న మనిషి.. ఇప్పుడిలా అనడం ఏంటనుకున్నారు. తర్వాత ఆయన మనసెరిగాక.. రచ్చ చేయకుండా.. జనానికి తెలియకుండా ఎలా సంపాదించుకోవాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు స్కెచ్ లు వేసుకుంటున్నారని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.
విజయవాడ స్థానిక ఎమ్మెల్యే ఒకరు.. మంచి అనుభవం ఉన్న నేత. కొన్ని ఈక్వేషన్ల వల్ల మంత్రి పదవి రాలేదు. పక్కన ఎమ్మెల్యేకి అంత సీన్ లేకపోయినా.. సామాజికవర్గం దెబ్బకు మంత్రి పదవి వచ్చింది. ఆయన తన శాఖ ద్వారాను, లోకల్ గాను రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. ఎటొచ్చి.. ఈ ఎమ్మెల్యేకే సమస్య వచ్చి పడింది. ఆయన కన్ను మున్సిపల్ కార్పొరేషన్ పై పడింది. అక్కడ ఎలాంటివి నడుస్తాయో.. ఆయనకు బాగా తెలుసు కూడా.
వన్ ఫైన్ డే.. టౌన్ ప్లానింగ్ అధికారి ఒకరికి ఆ ఎమ్మెల్యే నుంచి ఫోనొచ్చింది. ‘‘మీరు ఎంత వసూలు చేసుకుంటన్నారో తెలుసు.. వారం వారం లక్ష పంపించు.’’అని వార్నింగ్ ఇచ్చేశారు. టౌన్ ప్లానింగ్ లో ఉన్న పాత రూల్స్ వల్ల.. అదనపు ఫ్లోర్ల కోసం.. ఇతర ఉల్లంఘనల కోసం.. జనం దక్షిణ చెల్లించుకుని పని పూర్తి చేసుకుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. కాని వారానికి లక్ష ఎక్కడ నుంచి తెస్తానని ఆ అధికారి వాపోయాడు. వెంటనే పై అధికారి దగ్గరకెళ్లి.. తన ఏరియా మార్చమని మొత్తుకున్నాడు. అధికారికి ఫోన్ చేసినా లక్ష రాలేదు. అన్ని సర్కిల్స్ కి ఫోన్ వెళ్లింది. అందరూ నీళ్లు నమిలారే గాని డబ్బు పంపలేదు. ఎందుకంటే ఈయన అడిగే ఫిగర్లు అంతలా ఉన్నాయి మరి. ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. ఆ కోపం చూపించడానికో అవకాశం వచ్చింది. అక్రమంగా మున్సిపల్ స్థలంలో కట్టిన ఓ చర్చిని కూల్చేయాలని కమిషనర్ ఆర్డర్ ఇచ్చారు. అలా ఎలా కూలుస్తారంటూ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. అయినా అది ఆగలేదు. ఇక అంతే ఎమ్మెల్యే తన మనుషులతో ఎక్కెడెక్కడ అక్రమ నిర్మాణాలు లిస్టు తీయించి.. కమిషనరు ముందు పెట్టి.. నిలదీశారు. కమిషనర్ వెంటనే అవన్నీ టౌన్ ప్లానింగ్ అధికారులకు పంపించి.. కూలగొట్టిస్తున్నారు. వారికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో టౌన్ ప్లానింగ్ అధికారులకు, ఎమ్మెల్యేకు మాత్రమే తెలుసు.
తనకివ్వాల్సింది పద్ధతిగా పంపితే తప్ప.. ఈ వ్యవహారం ఆగదని మరోసారి ఎమ్మెల్యే హెచ్చరించారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని టౌన్ ప్లానింగ్ అధికారులు మంత్రికి చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ఎదురు వెళితే.. తన ఆదాయానికి ప్రాబ్లెమ్ కాబట్టి.. మంత్రి మౌనం వహించి.. ఆయన అడిగింది ఎంతో కొంత ఇచ్చేయండని సలహా ఇచ్చారు. మేం సంపాదించుకునేది దేవుడెరుగు.. ఈ పాట్లన్నీ ఎవడు పడతాడురా బాబూ అనుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు సెలవులు పెట్టుకోవడం ఉత్తమమని అనుకుంటున్నారు. ఏమైనా ఎమ్మెల్యేకి టౌన్ ప్లానింగ్ కి ఒక ఒప్పందం కుదరందే ఈ వ్యవహారం ఆగేలా లేదు.