పెద్దాయన చెప్పింది వేరు. ఆయన మాట్లాడిన సమావేశం, సందర్భం వేరు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయనను సైతం వదలకుండా తన అసహనాన్ని చూపించి.. మరోసారి జగన్మోహన్ రెడ్డి తన ఒరిజినల్ స్టైల్‌ను బయటపెట్టారు. అధికారంలోకి వచ్చాక గుంభనంగా వ్యవహారిస్తూ.. ఒక్క ఇసుక వ్యవహారంలో తప్ప.. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. ముందుకుపోతున్న జగన్మోహన్ రెడ్డిలో అసహనం పెరిగిందనే విషయం బయటపడింది.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం అనే విషయాన్ని బలంగా తీసుకుపోయి.. ప్రజల్లో తన ఇమేజ్ ను పెంచుకోవాలనే తాపత్రయంలో.. ఎవరిని ఏమంటున్నాననే విషయం కూడా మర్చిపోయారో.. లేక అన్నీ తెలిసే అన్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపర్చాయి. పవన్ కల్యాణ్ పై ఈ సందర్భంలో మరోసారి జగన్ చేసిన వ్యాఖ్యలు సైతం షాకిచ్చాయి. పవన్ కల్యాణ్ అంటే ఇసుక విషయంలో చిరాకు పుట్టిస్తున్నాడు కాబట్టి.. కోపమొచ్చి మళ్లీ ఆయన మల్టీ మ్యారేజ్ ల గురించి కామెంట్ చేసి ఉంటారనుకోవచ్చు. కాని వెంకయ్యనాయుడు ఏం చేశారని బిజెపి నేతలు నిలదీస్తున్నారు.
వెంకయ్యనాయుడు ఢిల్లీలో జరిగిన ఓ ఎన్నారైల సమావేశంలో సంస్కృత భాష ప్రాధాన్యత గురించి చెబుతూ… ఇంగ్లీషు కన్నా ఒకటి నుంచి పదోతరగతి వరకు మాతృభాషలో బోధించటం ఉత్తమం అని, దీని వల్ల పిల్లల్లో మంచి ఫౌండేషన్ వేసినట్లు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఉర్దూ సైతం ఆ విధంగా ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. అలా జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం పెడదామంటే.. కొన్ని స్వరాలు వినపడుతున్నాయని.. పెద్దల స్వరాలు కూడా వినపడుతున్నాయంటూ.. వెంకయ్యనాయుడు ఆయన పిల్లలను ఏ మీడియంలో చదివించారు.. మనవలు, మనవరాళ్లను ఏ మీడియంలో చదివించారంటూ ఎగతాళి చేస్తూ ప్రశ్నించారు. ఇక పవన్ కల్యాణ్ ని అయితే.. చెప్పనక్కర్లేదు.
జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన ఈ ధోరణి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపర్చింది. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన దూకుడు వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ, అధికారంలోకి వచ్చాక ఒక ముఖ్యమంత్రిగా ఉండి.. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి కామెంట్లు చేయడం ఏ విధంగా సబబని వారు ప్రశ్నిస్తున్నారు..
అందరూ చెప్పేది ఒకటే.. ఇంగ్లీషు మీడియం పెట్టినా.. తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉండాలి. క్రమేణా ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలని చెబుతున్నారు. మరికొందరు అయితే కొన్ని క్లాసుల వరకు మాతృభాషలో బోధిస్తేనే సైంటిఫిక్ గా కూడా కరెక్టని వాదిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ వాదనలన్నిటిని ఒకే గాటన కట్టి.. అసలు పేదవాళ్ల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే.. వీరందరూ అడ్డుపడుతున్నారనే ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ధోరణిని మేధావి వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ఇంత ముఖ్యమైన విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు సంప్రదింపులు జరిపి.. అభిప్రాయాలు సేకరించి.. చేయాలని.. అవేమీ చేయకుండా సొంతంగా నిర్ణయం తీసేసుకుని.. దానిని సమర్ధించుకోవడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక విధానంపై భిన్నాభిప్రాయాలు వస్తాయని.. వాటిలో కొన్నిటిని పరిగణనలోకి తీసుకోవచ్చు.. కొన్నిటిని తీసుకోకపోవచ్చని.. కాని వాటన్నిటిని రాజకీయ విమర్శలుగా ట్రీట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని వారు భావిస్తున్నారు.