ఏపీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ కోర్టుకు డుమ్మా కొట్టారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం జగన్ హైదరాబాద్‌లో సీబీఐ కోర్టుకు హజరు కావాల్సి ఉంటుంది. అయితే… ఏపీలో కేంద్రమంత్రి పర్యటన ఉన్నందున సీఎం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, కోర్టుకు హజరు నుండి మినహయింపు ఇవ్వాలని సీఎం తరుపు లాయర్లు కోరటంతో కోర్టు అనుమతించింది.
ప్రతి శుక్రవారం ఏపీ నుండి హైదరాబాద్‌కు రావటం, కోర్టుకు హజరుకావటం అంటే… ప్రజాధనం వృధా అవుతోందని, వ్యక్తిగత హజరు నుండి మినహయింపు ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. కానీ సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వ్యక్తిగత హజరు మినహయింపు ఇస్తే సీఎం స్థాయిలో ఉన్న అధికారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. దాంతో కోర్టు సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ… జగన్ పిటిషన్‌ను కొట్టివేసింది.