ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అలాగే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిలు కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఖచ్చితంగా కోర్టుకు హజరవ్వాల్సిందేనని న్యాయస్థానం చెప్పటంతో గతవారం కోర్టుకు వచ్చిన సీఎం జగన్, శుక్రవారం మాత్రం కోర్టుకు రాలేదు. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. గత వారం డిశ్చార్జ్ పిటిషన్లన్నింటిని కలిపి విచారించాలని వేసిన పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. వచ్చేవారం ఈ విషయంపై కోర్టు తీర్పునివ్వనుంది.
ఇదిలా ఉండగా.. జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇస్తుందా? లేదా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పిటిషన్ ను సీబీఐ కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈడీ కేసులో జగన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.