ఏపీలో ఇసుక రాజకీయం తారా స్థాయికి చేరింది. ఏపీ సర్కార్ తీసుకున్న హడావిడి నిర్ణయానికి భవన నిర్మాణ కార్మికులతో పాటు దాని అనుబంధరంగ కార్మికులు సైతం ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు కంటితుడుపుగానే మారుతుండటంతో… ప్రతిపక్షాలు ప్రత్యక్ష ఆందోళనను ముమ్మరం చేస్తున్నాయి.
అయితే ఇసుక కొరతకు నదులు ఉప్పొంగుతుండం ప్రధాన కారణంగా భావిస్తోంది వైసీపీ. దాదాపు 60 రోజుల నుండి కృష్ణా-గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం, తుంగభద్ర నదీ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ఇసుక కొరత ఉన్నట్లు వైసీపీ సర్కార్ వాదిస్తోంది. కనీసం ఇసుక రీచ్‌ల వద్దకు కూడా వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో… ఇసుక బయటకు ఎలా వస్తుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. 200కుపైగా రీచ్‌లను గుర్తిస్తే ప్రస్తుతం 69 చోట్లనుంచే ఎంతోకొంత వెలికి తీయగలుగుతున్నాం అంటున్నారు అధికారులు.
ఇందుకు పరిష్కార మార్గంగా… కాస్త వరద తగ్గుముఖం పట్టగానే… గ్రామ సెక్రటెరియట్ ద్వారా ఇసుక అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాబోయే మూడు నెలల కోసం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసి, అవినీతి లేకుండా ప్రజలకు అందించి, విపక్షాలకు గట్టి సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్.
అయితే ఇదంతా జరగాలి అంటే చాలా సమయం పడుతుందని ప్రత్యామ్నాయంగా ఇసుక ఇచ్చేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని భువన కార్మికులు ప్రాధేయ పడుతున్నారు. జగన్ తన మొండి వైఖరిని విడనాడాలని ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.