ఏపీ సీఎం జగన్ శుక్రవారం ఢీల్లీ వెళ్లనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాల్సి ఉన్నప్పటికీ మోడీతో మాత్రమే జగన్ భేటీ అయ్యారు. అమిత్ షా అపాయింట్ మెంట్ లభ్యం కాకపోవడంతోపాటు ఏపీలో బిజీ షెడ్యూల్ కారణంగా గురువారం ఏపీకి తిరుగుపయనమయ్యారు. శుక్రవారం అమిత్ షాతో భేటీకి అపాయింట్ మెంట్ దొరకడంతో ఆయన మరోసారి ఢీల్లీకి బయల్దేరనున్నారు.
కాగా జగన్, అమిత్ షాల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అలాగే మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయాలను అమిత్ షాకు జగన్ వివరిస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది హోంశాఖే కావడంతో ఈ భేటీ కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎం జగన్ ప్రధానితో భేటీ అనంతరం మరోసారి ఢీల్లీ వెళ్తుండటంతో.. ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.