చంద్రబాబునాయుడికి విశ్వసనీయత లేదు.. అవసరానికి వాడుకుని వదిలేస్తారు. ఇందుకు సీనియర్ ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటు.. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు… బావ హరికృష్ణ.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ఇలా చాలా పెద్ద లిస్టే ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే బిజెపిని వాజ్ పేయి టైములోను.. నరేంద్ర మోడీ టైములోను బాగా వాడేసి వదిలేశారని కూడా ఆయనపై ఆరోపణ. అలాంటి బాబుగారినే బీట్ చేసేలా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టయిల్ కు ఏ మాత్రం పోలిక లేకుండా.. వ్యవహారం నడిపిస్తున్న జగన్.. అందరినీ మాయ చేసే కేసీఆర్ నే మాయ చేయటంతో.. ఆయన విశ్వసనీయత పీక్స్ కి వెళ్లిపోయింది.
జగన్మోహన్ రెడ్డిగారి లిస్ట్ మొదలెట్టాలంటే.. ముందు రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ కేవీపీతో మొదలెట్టాలి. ప్రభుత్వాన్ని అంతా తానై నడిపించిన కేవీపీ.. వైఎస్ఆర్ చనిపోగానే సీఎం అవాలనుకున్న జగన్ కు మద్దతుగానే సోనియాతో మాట్లాడారు. కాని అధిష్టానం కాదనగానే .. జగన్ కు కూడా వద్దని చెప్పేశారు. కాని జగన్ ఒప్పుకోలేదు. అంతే అక్కడి నుంచి కేవీపీని వదిలేశారు. తర్వాత తన కోసం మంత్రి పదవిని వదులుకుని వచ్చిన కొండా సురేఖను.. జస్ట్ తృణపాయంగా వదిలేశారు.

జగన్ కోసం సీనియారిటీ ఉన్నా ఇగో పక్కన పెట్టి వచ్చిన సబ్బం హరి, మైసూరారెడ్డి, ఇంకా కొందరు.. జగన్ ఇగో దెబ్బకు వెళ్లిపోయారు. అంత సీనియర్లు అయినా.. తన ఇగోకే ప్రయారిటీ ఇచ్చారు గాని.. వారు తన కోసం వచ్చారన్న కనీస కనికరింపు కూడా లేకుండా వదిలేశారు.2014 ఎన్నికలకు ముందు సోనియాకు మాటిచ్చి బెయిల్ తెచ్చుకుని.. ఆ తర్వాత పరిస్థితులు మారటంతోనే.. తూచ్ చెప్పేశారని అంటుంటారు.ఆ తర్వాత రూల్స్ పక్కన పెట్టి పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని అత్యంత అగౌరవ రీతిలో గెంటేశారు. అన్నా అన్నా అంటూనే.. పోరా అని చెప్పేశారు. ఆ తర్వాత పీవీ రమేష్, అజేయ కల్లంల వంతు వచ్చింది. వారిదీ అదే పరిస్ధితి.
ఇక ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. అసలు గొడవలేంటి సిల్లీగా.. మేమెంత మెచ్యూర్డో తెలుసా మీకు.. అలాంటివేమీ లేకుండా ఎంచక్కా చెట్టపట్టాలేసుకుని.. కలిసి ప్రాజెక్టులు కట్టుకుంటామన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ ని జగన్ మామూలుగా వాడుకోలేదు. ఇప్పుడు బిజెపి సంకనెత్తుకోగానే.. జగన్ రూటు మార్చేశారు. అసలు ప్రాజెక్టులపై కేసీఆర్ మాటలు పట్టించుకోనక్కర్లేదని అలా తీసిపారేశారంతే. కేంద్ర జల శాఖకు కూడా పెద్ద లెటర్ రాసేశారు.. కేసీఆర్ లా విమర్శించినా కనీసం.. తెలంగాణ ప్రభుత్వం సాటిస్ ఫై అయ్యేది.. కాని ఇక్కడ అసలు కేసీఆర్ ఎవరు.. ఆయనకేం పని అన్న రేంజ్ లో వెళ్లిపోయింది వ్యవహారం.
దీంతో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డే గాని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదని.. అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఆయన అనుకున్నదే.. ఆయనకు కావాల్సిందే తప్ప.. నో విశ్వసనీయత.