ప్రతిపక్షాలను విమర్శించడంలో కేసీఆర్ స్టయిలే వేరు. కాస్త బూతులు యాడ్ చేసి డైరెక్ట్ గానే ఆయన తిట్టిపోస్తుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా కేసీఆర్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. “జగనన్న వసతి దీవెన” రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు జగన్. నంద్యాలలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలతో పాటు మీడియాపైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
ప్రజల సంక్షేమం కోసం తాము పాటుపడుతుంటే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరెంత బురదచల్లినా తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.
తాను ఉన్నానన్న నమ్మకంతో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల్ని తల్లిదండ్రులు చేర్పిస్తున్నారని చెప్పిన జగన్.. చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రునికి, ఎల్లో మీడియాకి ఇవన్నీ కనిపించవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో కట్టుకథ చెప్పి అప్రతిష్ఠపాలు చేసేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిపక్షం ఈ దౌర్భాగ్య స్థితిలో ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అయితే.. జగన్ వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. “గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిరాడని తేలిపోయిన తరువాత ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. జగన్ గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేదు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి. అప్పుడు మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం” అంటూ సెటైర్లు వేశారు లోకేష్.