ట్విట్టర్లో కూడా ఫాక్షనిజం ఉందా? ఫ్యాక్షనిజంతో ప్రత్యర్ధుల్ని దెబ్బతీసినట్లు ట్విట్టర్ అకౌంట్లను మూకుమ్మడి ఫిర్యాదులతో క్లోజ్ చేయిస్తున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. చిరంజీవి అభిమానులు, జనసేన కార్యకర్తలు ఇది ట్విట్టర్ ఫాక్షనిజమేనని ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది.
జనసేన పార్టీ లేవనెత్తిన చట్టబద్ధమైన ప్రశ్నలకు సమాధానాలు లేనప్పుడు తాము ఏమి చేయాలని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు మద్దతు ఇచ్చే ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయడం జరిగిందని కామెంట్ చేశారు. వై ఎస్ జగన్ స్టయిల్ ట్విట్టర్ ఫాక్షనిజాన్ని స్వాగతిస్తున్నామని ట్విట్టర్లో సెటైర్ వేశారు.
ఏదైనా ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయించాలంటే మూకుమ్మడిగా ఇది సరైన అకౌంట్ కాదని వందకుపైగా ఫిర్యాదులు వెళితే అంతేసంగతులు. ఆ ఖాతా క్లోజ్. ఇలా మూకుమ్మడి ఫిర్యాదులతో జగన్ ఫాలోయర్స్ అకౌంట్లను క్లోజ్ చేయించారని అభియోగం. ‘జే ఎస్ పి వీర మహిళా’, ‘జే ఎస్ పి శతఘ్ని టీం’, ‘పొలిటికల్ సేన’, ‘ట్రెండ్ పిఎస్ పీకే’ అకౌంట్లను ట్విట్టర్ రూల్స్ అతిక్రమించినందుకు సస్పెండ్ చేసినట్లు నోట్ వచ్చింది. దీనిపై మెగాస్టార్ ఫాలోయర్ @ చిరు ఫాలోయర్ ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.