ఒంగోలు: వుహించినట్లుగానే పర్చూరు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీ చెక్ పెట్టే యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్‌బై చెప్పిన రావి రామనాథంబాబును వైసీపీలో చేర్చుకోవడం వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. అయితే నియోజకవర్గ ఇంచార్జ్ గా గొట్టిపాటి భరత్ కు అవకాశం వస్తుందా? లేక రావి రామనాథంబాబును ఎంపిక చేస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. మొత్తం మీద ఇక దగ్గుబాటికి చెక్ పెట్టినట్లేనని తెలుస్తోంది.
ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరి వరకూ పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా పని చేసిన రావి రామనాథంబాబు దగ్గుబాటి సీన్లోకి రావడంతో టీడీపీలో చేరారు. దగ్గుబాటి, ఆయన కుమారుడు పార్టీలో చేరడం, ఎన్నికల్లో దగ్గుబాటి పోటీచేసి ఓడిపోవడం జరిగాక రాజకీయాలు మారాయి. ప్రస్తుతం రావి రామనాథంబాబును ముఖ్యమంత్రి జగన్ కండువాకప్పి పార్టీలో చేర్చుకోవడం విశేషం. మారిన రాజకీయానికి ఇది నిదర్శనంగా ఉంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సమక్షంలో ఆయనను పార్టీలో చేర్చుకోవడంతో వారి సిఫారసు ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి ఇక బయటకు రావాల్సిందేనని తెలుస్తోంది.
ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్ దగ్గుబాటి, ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్‌లకు రావి చేరిక వ్యహారం తెలియదని తెలుస్తోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు, నియోజకవర్గానికి చెందిన ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కార్యక్రమానికి రావడం చూస్తే అంతా వ్యూహాత్మకంగా జరిగిందని తెలుస్తోంది.
ఇక దగ్గుబాటి బీజేపీలో చేరతారా? రాజకీయాలు బంద్ చేస్తారా? కుమారుడు చెంచురాం పరిస్థితి ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.